బడులకు అందని భగీరథ.!చాలా పాఠశాలలకు నల్లా కనెక్షన్ ఇయ్యలే

బడులకు అందని భగీరథ.!చాలా పాఠశాలలకు నల్లా కనెక్షన్ ఇయ్యలే
  • ఇచ్చిన చోట్ల స్టోరేజీకి ఏర్పాట్లు చేయట్లే 
  • ఉదయం 6 గంటలకే నల్లానీళ్లు.. ఆ తర్వాత బోర్లే దిక్కు! 
  • ఇంటి నుంచే బాటిల్స్​లో నీళ్లు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్​
  • వేసవి సమీపిస్తున్నా.. కండ్లు తెరవని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడులకు తాగునీరు అందడం లేదు.  భగీరథ పైపులైన్లు పాఠశాలల వరకు వేసినా.. కొన్ని స్కూళ్లలో వాటర్ ట్యాంకులు, నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో చేతి పంపులు, బోర్లు, ఆర్వో ప్లాంట్లు, ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. మరికొన్ని బడుల్లో వాటర్ ట్యాంకులున్నా..  నిర్వహణలోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ట్యాంకుల్లో పాకురు పేరుకుపోయి నీళ్లు తాగలేని పరిస్థితి నెలకొంటున్నది.  కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లకపోవడంతో నీళ్లు రంగు మారిపోతున్నాయని, ఈ నీళ్లు తాగలేకపోతున్నామని  విద్యార్థులు చెబుతున్నారు.  చాలా వరకు బడుల్లో విద్యార్థులు ఇంటి నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఉదయం తెచ్చుకున్న  లీటర్ బాటిల్​నీళ్లనే.. సాయంత్రం వరకూ తాగుతున్నామని అంటున్నారు. ఇక కొన్ని చోట్ల నీటి సప్లై అవుతున్న సమయంలో స్కూల్స్ తెరుచుకోకపోవడంతో వాటర్​ను స్టోరేజీ చేయడం లేదు.  మిషన్ భగీరథ అధికారులు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు నీటిని వదులుతున్నారు. ఈ సమయానికి స్కూల్స్ ఓపెన్ కాకపోవడం.. నీటిని ట్యాంకుల్లో నిల్వ చేసుకోకపోవడంతో బడుల్లో విద్యార్థులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.   

సగానికిపైగా స్కూళ్లకు అందని నీళ్లు  

మిషన్ భగీరథలో భాగంగా గ్రామాల్లో పైపులైన్లు, వాటర్‌‌‌‌‌‌ ట్యాంకులను ప్రభుత్వం నిర్మించింది. అయితే, పలుచోట్ల ఇంకా పనులు పూర్తి కాలేదు. పూర్తయినచోట నిర్వహణ లోపంతో నీళ్లు అందడం లేదు. రాష్ట్రంలో   మొత్తం 26,087 స్కూళ్లు  ఉన్నాయి.  ఇందులో 25,046 స్కూల్స్ లో నీటి సదుపాయం ఉందని, 1,041 స్కూల్స్ లో ఫెసిలిటీ లేదని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది.  కనీసం సగానికిపైగా విద్యాసంస్థలకు నీళ్లు అందని పరిస్థితి నెలకొన్నది.  గత ప్రభుత్వం ‘మన ఊరు–-మన బడి’ కార్యక్రమం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో నీటి వసతులు కల్పించేందుకు పనులు చేపట్టింది. దీంతో కొంత మేరకు సమస్యలు పరిష్కారమైనా.. ఇంకా కొన్ని చోట్ల తాగునీటి గోస తప్పడం లేదు.  అంతేకాకుండా వేసవి దృష్ట్యా ఆఫీసర్లు  ముందస్తు చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ పాఠశాలలకు మిషన్‌‌‌‌ భగీరథ కింద పైపులైన్‌‌‌‌ కనెక్షన్లు ఇచ్చినా.. ఇబ్బందులు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలు,  గిరిజన గూడేలు, తండాల్లోని  స్కూళ్లకు మిషన్ భగీరథ నీరు  అందడం లేదు. 

ముందస్తు చర్యలేవీ?

రాష్ట్రంలో పలు పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సైతం నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. వీటిని పునరుద్ధరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూలన పడ్డాయి. కాగా, ప్రస్తుతం ఫిబ్రవరి ప్రారంభంలోనే ఎండలు మండుతుండడం.. స్కూల్స్ లో తాగునీటి సరఫరాకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.  కొన్ని స్కూళ్లలో బోర్లు అడుగంటిపోవడంతో  తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. మోటారు ఆన్ ఆఫ్ చేసి ప్రారంభిస్తేనే మధ్యాహ్న భోజన వంటకు నీరు అందుతున్నది. విద్యార్థులు తిన్న తర్వాత చేతులు కడుక్కునేందుకు, వాష్ రూమ్ కు  వెళ్లినప్పుడు నీళ్లు దొరకడం లేదు. కాగా, విద్యార్థులు సరైన మోతాదులో నీళ్లు తాగకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా, కలుషితనీరు తాగడం వల్ల టైఫాయిడ్, వైరల్ హెపటైటిస్ , అతిసారం వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.   విద్యార్థులకు సరైన తాగునీటి వసతి కల్పించాలని, నీళ్లు తాగేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. 

ట్యాంకు కట్టి వదిలేశారు..

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని జడ్పీహెచ్​ఎస్ స్కూల్​లో 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిషన్ భగీరథ కింద ఈ స్కూల్​లో ట్యాంక్ నిర్మించి వదిలేశారు. నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. ప్రస్తుతం విద్యార్థులు బోర్ నుంచి పై ట్యాంక్​లో నింపిన నీళ్లను నల్లాల ద్వారా పట్టుకొని తాగుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు అందించాలని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.

మహబూబాబాద్​లో ..

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ , డోర్నకల్, నర్సింహులపేట, దంతాలపల్లి మండల్లాల్లోని పలు స్కూల్స్ లో భగీరథ నీరు రావడం లేదు. నల్లా కనెక్షన్లు ఇవ్వకపోవడం.. వాటర్ ట్యాంకు నిర్మించకపోవడంతో భగీరథ నీటిని సరఫరా చేయడం లేదు. జిల్లావ్యాప్తంగా భగీరథ నీళ్లు అందిస్తున్నామని చెబుతున్నా.. నేటికీ పలు బడుల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లపైనే ఆధారపడుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో నీటిని కొనుగోలు చేయాల్సి దుస్థితి నెలకొన్నది. ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఇంటి నుంచి సీసాల్లో నీటి తెచ్చుకుని తాగుతున్నారు.