స్కూళ్లన్నీ చెత్త చెత్త... స్కావెంజర్లు లేక సిటీలో తిప్పలు

స్కూళ్లన్నీ చెత్త చెత్త...  స్కావెంజర్లు లేక సిటీలో తిప్పలు
  • మినరల్స్ ఫండ్స్​నుంచి తీసుకోవాలని ఆదేశాలు  
  • అందులో ఒక్క రూపాయీ లేదు
  • 7 నెలలుగా ఇదే పరిస్థితి 
  • కొన్ని చోట్ల సొంతంగా చెల్లిస్తున్న హెచ్ఎంలు, టీచర్లు 
  • డీఎస్ఈకి లెటర్ రాసిన డీఈవో

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ పరిధిలోని స్కూళ్లలో స్కావెంజర్లు లేక చెత్తమయమవుతున్నాయి. ప్రతి స్కూల్ లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కావెంజర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం గత జూలైలో ఆదేశించింది. జీతాల చెల్లింపు కోసం స్కూల్ ఫెసిలిటీ మెయింటనెన్స్ గ్రాంట్ ను జిల్లా మినరల్ ఫండ్ నుంచి తీసుకోవాలని సూచించింది. జీవో ప్రకారం జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ నుంచి అమ్మ ఆదర్శ కమిటీల అకౌంట్ల ద్వారా హెచ్ఎంలకు నగదును అందజేయాలి.

గత ఆగస్టు నుంచి ఒక్క హైదరాబాద్ జిల్లాలో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్కావెంజర్లను నియమించారు. అక్కడి స్కావెంజర్లకు జిల్లా మినరల్ ఫండ్ ద్వారా జీతాలు కూడా అందుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మాత్రం చాలా స్కూళ్లలో స్కావెంజర్ల నియామకమే జరగలేదు. దీంతో ఏడు నెలలుగా స్కావెంజర్లు లేక స్కూళ్లను అపరిశుభ్రంగా తయారయ్యాయి.

చెత్తను ఊడ్చేవారు, టాయిలెట్స్ క్లీన్ చేసేవారు, చెట్లకు నీళ్లు పెట్టేవారు  లేక స్కూళ్ల పరిసరాలు చెత్త చెదారంతో నిండిపోయాయి. కొన్ని స్కూళ్లలో తామే డబ్బులు వేసుకొని స్కావెంజర్లకు చెల్లిస్తున్నామని హెచ్ఎంలు, టీచర్లు వాపోతున్నారు. తమ దగ్గర స్కావెంజర్లు కొన్ని నెలలు పనిచేశారని,  జీతాలు రాకపోవడంతో వెళ్లిపోయారని మరి కొందరు స్కూళ్ల టీచర్లు చెప్తున్నారు.  

మినరల్ ఫండ్​ట్రస్ట్ డబ్బులు లేవా... 

విద్యాశాఖ విడుదల చేసిన జీవో నెం. 21  ప్రకారం జిల్లా మినరల్ ఫండ్స్​నుంచి స్కావెంజర్ల జీతాలకు చెల్లింపులు జరపాలి. అయితే, హైదరాబాద్ జిల్లాలో మినరల్​ ఫండ్ ఖజానా ఖాళీ అయినట్లు తెలుస్తున్నది. దీంతో ఏడు నెలలుగా జిల్లాలో స్కావెంజర్ల నియామకం, జీతాల చెల్లింపులు జరగడం లేదు. మినరల్​ఫండ్స్ లేకపోవడంతో జిల్లా విద్యాశాఖాధికారులు డైరెక్టర్​ఆఫ్​స్కూల్ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) కు లెటర్ కూడా రాసినట్లు తెలుస్తున్నది. డీఎస్ఈ నుంచి వచ్చే స్పందన కోసం జిల్లా విద్యాశాఖాధికారులు వేచిచూస్తున్నారు.

అయితే, జిల్లాలోని 384 స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల(ఏఏపీ)పనులు చేపట్టారు. దాదాపు363 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఏపీసీ పనులకు నిధులు జిల్లా మినరల్ ఫండ్ నుంచే చెల్లించడంతో.. ఖజానా ఖాళీ అయినట్లు తెలుస్తున్నది. ఏఏపీ పనులకు సంబంధించి ఇప్పటికే 50 శాతం చెల్లింపులు జరిపినట్లు సమాచారం. మిగతా పనులకు సంబంధించి చెల్లింపులు కూడా ఫండ్ లేకపోవడం వల్లే ఆగిపోయాయని తెలుస్తున్నది. చేసేది లేక జిల్లా విద్యాశాఖ అధికారులు డీఎస్ఈ లేఖ రాశారు.  

మొదటి నుంచి నిర్లక్ష్యమే... 

స్కూల్ ఫెసిలిటీ మెయింటనెన్స్ గ్రాంట్ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మొదటి నుంచి స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో స్కూల్ ఫెసిలిటీ మెయింటనెన్స్ గ్రాంట్ ఆగస్టు నుంచే విడుదల జరగగా, జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం డిసెంబర్ వరకు కలెక్టర్ కు గ్రాంట్స్ కోసం లెటర్ పెట్టుకోలేదు. అదీ కూడా గ్రాంట్స్​ విడుదల గురించి జిల్లా ఉపాధ్యాయ సంఘాల విద్యాశాఖ అధికారులను కోరే వరకు సోయి లేకపోవడం గమనార్హం.

మినరల్ ఫండ్ లేదని తెలియడంతో వారం క్రితం జిల్లా విద్యాశాఖ అధికారులు డైరెక్టర్ ఆఫ్​స్కూల్ ఎడ్యుకేషన్​ కు స్కూల్ ఫెసిలిటీ మెయింటనెన్స్ గ్రాంట్ గురించి లెటర్​ రాశారు.  హైదరాబాద్ జిల్లాలో ఏడు నెలలుగా  దాదాపు రూ. 4 కోట్లు రావాల్సింది ఉంది.

మున్సిపాలిటీలకు అప్పజెప్పిన గత సర్కారు 

గత బీఆర్ఎస్ గవర్నమెంట్ స్కూళ్లలో ఊడ్వడం, టాయిలెట్లను క్లీన్ చేయడం, చెట్లకు నీళ్లు పోయడం వంటి పనులను స్థానిక మున్సిపాలిటీలకు, జీపీలకు అప్పజెప్పింది. హైదరాబాద్ జిల్లాలో సర్కిళ్ల వారీగా బల్దియా కార్మికులు స్కూళ్లను శుభ్రపరచాలని కండీషన్​పెట్టారు. మొదట ఈ కార్యక్రమం సాఫీగానే సాగినా పని భారం వల్ల కార్మికులు స్కూళ్ల వైపు రావడం ఆపేశారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కూల్ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి, అమ్మ ఆదర్శపాఠశాల స్కీమ్ ద్వారా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, గతేడాది జూలైలో స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను బట్టి స్కావెంజర్లను నియమించుకోవాలని జీవో నంబర్​ 21 ను విడుదల చేసింది. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ జిల్లాలో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో స్కాంవెంజర్ల నియామకం జరిగి, జీతాలు కూడా వస్తున్నాయి. 

స్కావెంజర్ల నిధులు రిలీజ్ చేయాలి  

హైదరాబాద్ లో స్కావెంజర్ల ఫండ్స్​ విషయమై గత డిసెంబర్ లోనే డీఈవో దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. మిగతా జిల్లాల్లో ఫండ్స్​రిలీజ్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ఈ సమస్య ఉంది. స్కావెంజర్లు లేక కొన్ని స్కూళ్లలో పిల్లలు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలి. స్కావెంజర్ల నిధులు వెంటనే రిలీజ్ చేయాలి.
– రామ సుబ్బారావు, ఎస్టీయూటీఎస్,హైదరాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ

విద్యార్థుల సంఖ్య ప్రకారం విడుదల కావాల్సిన నిధులు... 
 

సంఖ్య     విద్యార్థుల సంఖ్య    నెలకు చెల్లింపులు    
1                     1–30                                 3000
2                     31–100                             6000
3                     101–250                           8000
4                      251–500                       12,000
5                   501–750                          15,000
6                   750 కంటే ఎక్కువ          20,000