సర్కారు బడుల మూత.. టీచర్ ​పోస్టుల కోత

తెలంగాణలో ప్రభుత్వ బడుల మూసివేత కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. బడుల్లో పిల్లలు లేకపోవడం వల్లే మూసివేస్తున్నామని చెబుతున్న సర్కారు.. ఆ నెపాన్ని టీచర్లు, తల్లిదండ్రుల మీదకు నెట్టివేస్తుంది. కానీ ఆయా ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరకపోవడానికి, తల్లిదండ్రులు చేర్పించక పోవడానికి గల అసలు కారణాలను తెలుసుకునే, విశ్లేషించే ప్రయత్నం ఒక్కటంటే ఒక్కటి కూడా నేటికీ అధికారికంగా, శాస్త్రీయంగా జరగలేదు. కేవలం టీచర్లను నిందితులుగా చేసే విష ప్రచారం మాత్రమే విస్తృతమవుతోంది. ఓ బడిలో విద్యార్థుల సంఖ్య సున్నా అంటే దానర్థం ఆ గ్రామంలో బడి ఈడు పిల్లలు లేరని కాదు. విద్యార్థులు ఉన్నా.. ఊరి బడిని వదిలి, కిక్కిరిసిన బస్సుల్లో తమ పిల్లలను పేరెంట్స్​ దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు బడులకు పంపుతున్నారు. 
ఈ పరిస్థితికి కారణం ఎవరు?
ఉన్న ఊరిలో సర్కారు బడి కాదని, పేరెంట్స్​తమ పిల్లలను ప్రైవేటు స్కూల్​కు పంపడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమ బోధన అందులో మొదటిది. కాగా సర్కారు బడుల్లో ముఖ్యంగా ప్రైమరీ స్థాయిలో ఒకటి లేదా రెండు గదుల్లో అన్ని తరగతులు ఒకరు లేదా ఇద్దరు టీచర్లు నిర్వహించాల్సి రావడం మరొక ప్రధాన కారణం. రాష్ట్రంలో ఉన్న మొత్తం 60,47,932 మంది విద్యార్థుల్లో అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 4,39,540 మంది. అంటే కేవలం 7 శాతం మంది చదువుతున్న వ్యవస్థను ప్రభుత్వం తమ ప్రాధాన్య విద్యా విభాగంగా బహిరంగంగా ప్రకటించి, 19,73,571 మంది అంటే 33 శాతం విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ, పంచాయతీ రాజ్, స్థానిక సంస్థల పాఠశాలలను గాలికొదలడం కూడా ముఖ్య కారణమే. కొన్ని చోట్ల టీచర్ల పని తీరు కూడా ఓ కారణం కావచ్చు. కానీ అది చాలా స్వల్పం. అది సరిదిద్ద లేని సమస్య కానే కాదు. అందుకోసమే విద్యా శాఖలో పర్యవేక్షణాధికారుల వ్యవస్థ ఉంది. దాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఖాళీలు నింపడం పక్కకు పెట్టి ఒక్కో ఎంఈవోకు 5 నుంచి 6 మండలాలు, డీఈవోలకు రెండు, మూడు జిల్లాల ఇన్​చార్జి బాధ్యతలు అప్పజెప్పి మమ అనిపించుకుంటోంది. దీంతో పర్యవేక్షణ సరిగా లేక సర్కారు బడులను పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. 
39,093 టీచర్​ఖాళీలు
 బడుల మూత కార్యక్రమం గత కొన్ని ఏండ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది.  ఇప్పటికే వేల సంఖ్యలో మూతపడగా, ఏటా మరికొన్ని వాటికి తోడు చేస్తున్నారు. ఆ ప్రక్రియనే ప్రభుత్వం పని సర్దుబాటు, పాఠశాలల విలీనం, హేతుబద్ధీకరణ అని అందంగా పిలుస్తోంది. వీటి వల్ల టీచర్ల ఖాళీలను భర్తీ చేయడం, పాఠశాలల వసతుల కల్పన వంటి పనుల నుంచి తప్పించుకోవచ్చనేది సర్కారు భావన. రాను రాను విద్యారంగ బడ్జెట్ ను తగ్గించు కోవాలని చూస్తోంది. విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ ను ప్రభుత్వం నిరర్ధకమైనదిగా భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ఉన్న 39,093 టీచర్ల ఖాళీలు భర్తీ చేయకుండా సున్నా పాఠశాలల పేరు చెప్పి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తోంది. అంతేకాకుండా పదోన్నతులు కల్పించి హైస్కూళ్లలో సబ్జెక్ట్​ టీచర్ల అవసరాలను తీర్చకుండా ప్రైమరీ టీచర్ల సర్దుబాటు పేరుతో పనిచేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతోంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే యూడైస్​లెక్కల ప్రకారం ఈ అకడమిక్ ​ఇయర్​లో రాష్ట్రంలో 1201 బడుల్లో విద్యార్థులు నమోదు కాలేదు. ఈ జాబితాలో 163 బడులతో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, మహబూబాబాద్(140)రెండు, వరంగల్( 80) మూడు, జనగామ(49) నాలుగు, యాదాద్రి(47) ఐదో స్థానాల్లో ఉన్నాయి. అవన్నీ ప్రాథమిక పాఠశాలలే అనుకున్నా ఒక్కో బడిలో రెండు పోస్టుల చొప్పున 2402 ఉపాధ్యాయ పోస్టులు ఈ ఒక్క సంవత్సరం లోనే రద్దు కానున్నాయి. 
అనధికార బదిలీలు..
ప్రభుత్వం పని సర్దుబాటు పేరుతో టీచర్ల అనధికార బదిలీలకు తెర తీసింది. వసతుల లేమితో కొట్టుమిట్టాడటం కంటే, గ్రామీణ ప్రాంత బడులను వదిలి కొన్ని సౌకర్యాలైనా ఉండే పట్టణ ప్రాంతాల్లోకి వెళ్లడానికి కొంతమంది టీచర్లు చొరవ చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి పద్ధతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇది విద్యా రంగానికి ఎంత నష్టమో, ఎంతటి సామాజిక ద్రోహమో టీచర్లు, సమాజం గ్రహించాలి. బడుల మూసివేతకు ప్రభుత్వ విధానాలను, కుట్రలను సాగనివ్వమంటూ ఎదురొడ్డి నిలవాలి. తల్లిదండ్రుల మద్దతు కూడగట్టి అవసరమైన గదుల కోసం, అదనపు టీచర్ల కోసం, సౌకర్యాల కోసం పోరాడాలి. గ్రామంలో బడి ఏర్పాటు సమయంలో భాగస్వామ్యమయ్యే లోకల్ సర్పంచ్, మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే.. మూసివేత టైమ్​లో ఎందుకు కనబడటం లేదో అర్థం కాని విషయం. 

బడిని బతికిద్దాం..
బడిబాట, పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణ లాగానే ‘బడిని బతికిద్దాం’ అనే కార్యక్రమాన్ని రూపొందించాలి. మూతబడిన పాఠశాలల ఆవాస ప్రాంతాలను సందర్శించి, గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించాలి. విద్యాశాఖతో పాటు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులను, ఉపాధ్యాయ సంఘాలను భాగస్వామ్యం చేయాలి. కార్యక్రమ విజయవంతానికి వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బృందాలను నియమించాలి. కోవిడ్ పరిస్థితుల్లో సర్కారు బడుల వైపు మొగ్గుతున్న ప్రజల ఆలోచనను ప్రభుత్వం పటిష్ట పరిచాలి. ప్రభుత్వ విద్యా పరిరక్షణ ఉద్యమకారులుగా టీచర్​ సంఘాలు గత పదేండ్లుగా బడుల మూసివేతను వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో దసరా సెలవుల్లో చేసిన ఈ ప్రయత్నం కొంత సక్సెస్​అయింది. ప్రభుత్వం బడి మూసివేస్తున్న ఆవాస ప్రాంతంలో ప్రజలు ఆ బడిని కాపాడుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులు కావాలనుకుంటున్న ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, మానవీయ సమాజ సృష్టికి కర్మాగారాలైన ప్రభుత్వ బడులను మూసివేయడం సామాజిక హత్య కిందకే వస్తుంది. 

సర్కారు స్కూళ్లను బరువుగా భావిస్తున్న  రాష్ట్ర ప్రభుత్వం.. బడిలో పిలగాండ్లు లేరనే నెపంతో వాటిని మూసి వేస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో స్కూళ్లను క్లోజ్​ చేసిన సర్కారు ఈ ఏడాది జీరో ఎన్​రోల్​మెంట్​ నమోదైన 1,201 స్కూళ్లను మూసివేసేందుకు చర్యలు ప్రారంభించింది. దీంతో పేద, నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉండగా.. స్కూళ్ల మూత ద్వారా వేల సంఖ్యలో టీచర్ల పోస్టులకు కూడా కోత పడుతోంది. సర్కారు కుట్రను అడ్డుకునేందుకు టీచర్లు, పేరెంట్స్, విద్యావేత్తలు, యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.