ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలు ఉండాలి :ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి

 సత్తుపల్లి, వెలుగు :  ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యను అందించాలని, అందుకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధికారులకు సూచించారు. సోమవారం పట్టణ పరిధిలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలను ఆమె తనిఖీ చేశారు.

మధ్యాహాన భోజనాన్ని పరిశీలించారు. టాయిలెట్స్, తాగునీరు, ఇతర వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్​ హెడ్మాస్టర్​ చిత్తలూరు ప్రసాద్, సొసైటీ ఉపాధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా, అరవపల్లి సందీప్ గౌడ్ పాల్గొన్నారు. 
విద్యార్థికి అభినందన 


జాతీయస్థాయిలో నిర్వహించిన కరాటే చాంపియన్​షిప్ 2023 పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థి హర్షిత్ ను ఎమ్మెల్యే రాగమయి అభినందించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో కరాటే విజేతను ఎమ్మెల్యే సన్మానించి మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి  సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచాలని సూచించారు.
పోచవరంలో చర్చి ప్రారంభం 


కల్లూరు : మండల పరిధిలోని పోచవరంలోని  ఎస్సీ కాలనీలో కొత్తగా నిర్మించిన చర్చిని ఎమ్మెల్యే రాగమయి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు చర్చి ఫాదర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో  ఆమె పాల్గొని వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేనే క్రైస్తవులు ఘనంగా సత్కరించారు. .