పీఎస్‌యూ బ్యాంకుల్లోని వాటాలను వీలైనంత త్వరగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను ఆదేశించింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల్లో వాటాల అమ్మకాన్ని ప్రస్తుత ఆర్థిక
సంవత్సరంలోనే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే ఈ బ్యాంకులకు మొండి బకాయిలు ఎక్కువగా ఉండటం, సంప్రదింపులు తొలి దశలోనే ఉండటం, మార్కెట్లో పరిస్థితులు బాగా లేకపోవడం వంటి ఇబ్బందుల వల్ల వాటాల అమ్మకం పూర్తికావడానికి చాలా సమయం పడుతుందని ఎక్స్‌పర్టులు అంటున్నారు.
న్యూఢిల్లీ: కరోనా వల్లఖాళీ అయిన ఖజానాను నింపుకోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని వాటాలను త్వరగా అమ్మేయాలని మోడీ సర్కారు భావిస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో బ్యాం క్, ఐడీబీఐ బ్యాంకు (దీన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ గా పరిగణిస్తున్నారు)ల్లోని వాటాల అమ్మకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే ఈ పనిని పూర్తి చేయాలని పీఎంఓ ఆఫీసర్లు స్పష్టం చేశారు. ఈ నాలుగు బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ హోల్డింగ్స్ ద్వారా మెజారిటీ వాటాలు ఉన్నాయి. బ్యాంకిం గ్ సెక్టార్ లోమరిన్ని మార్పులు తేవాలని మోడీ ప్రభుత్వం కోరుకుంటోంది.
బ్యాంకుల ప్రైవేటైజేషన్‌ను వేగవంతం చేస్తోంది. ఎయిర్ ఇండియా వంటి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను కూడా అమ్మి నిధులను సమీకరించాలని ప్లాన్లను తయారు చేసింది. కరోనా లాక్‌డౌన్‌వల్ల బిజినెస్ లు నడవకపోవడంతో ప్రభుత్వ పన్నుల ఆదాయం విపరీతంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. అందుకే వచ్చే మార్చిలోపు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులను ప్రైవేటైజ్ చేయాలని పీఎంఓ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖను కోరింది. దీంతో వాటాల అమ్మకం పనిని ఆర్ధిక శాఖ సీనియర్ ఆఫీసర్లు మొదలుపెట్టారని, ఇప్పటికే కొందరితో సంప్రదింపులు మొదలయ్యాయని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ విషయమై పీఎంఓ, బ్యాంకులు, కేంద్ర ఆర్ధిక శాఖ ఆఫీసర్లు మాట్లాడేందుకు ఇష్టపడలేదు.
వచ్చే మార్చిలోపు కష్టమే…
ప్రభుత్వరంగ బ్యాంకుల మొండిబాకీలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. వీటిని కాపాడటానికి ప్రభుత్వం తరచూ ఆర్ధిక సాయం చేయాల్సి వస్తోంది. అందుకే బ్యాంకుల ప్రైవేటైజేషన్ కోసం పీఎంఓ ఆర్ధిక మంత్రిత్వశాఖపై ఒత్తిడి పెంచుతోంది. మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వాటాల అమ్మకం అంతా ఈజీ కాకపోవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్టులు అంటున్నారు. చాలా బ్యాంకుల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నారు. వీటన్నింటినీ గమనిస్తే వాటాల అమ్మకం వచ్చే
ఆర్థిక సంవత్సరంలోనే పూర్తికావొచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాంకుల్లో వాటాలతో పాటు పీఎస్‌యూల్లో సగం కంపెనీలను అమ్మడానికి మోడీ సర్కారు ప్రయత్నిస్తోంది. బ్యాంకులను విలీనం చేసి లేదా వాటాలను అమ్మడం ద్వారా ఐదింటికి పరిమితం చేస్తామని ఇది వరకే ప్రకటించింది. మనదేశంలో ప్రస్తుతం డజనుకుపైగా పీఎస్‌యూ బ్యాంకులు ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంకు లో ప్రభుత్వానికి 47.11 శాతం, ఎల్‌ఐసీకి 51 శాతం వాటాలు ఉన్నాయి. ‘‘కరోనా సమయంలో బ్యాంకిం గ్‌సెక్టార్ లోరిఫామ్స్ తేవడానికి బదులు వీటిలో స్టాఫ్‌ను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. అవసరానికి మించి ఉన్న ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ఇవ్వాలి. ఎక్కువ నష్టాలు తెస్తున్న బ్రాంచ్‌లను మూసివేయాలి’’ అని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు.