కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా జగిత్యాలలో పాదయాత్ర ప్రారంభించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.450 ఉండేనని, ఇప్పుడు రూ.1250 పెరిగిందని ఆరోపించారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్న ఆయన.. అక్కడ రూ.550 ను ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.
తమ పార్టీ అధికారంలో వస్తే రూ.500 కే సిలిండర్ మీ ఇంట్లో దించుతామని స్పష్టం చేశారు. పెంచిన సిలిండర్ ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు పెట్టడానికైనా రెడీగా ఉందని, బీఆర్ఎస్ ఓటుకు నోటు ఇవ్వడానికైనా రెడీగా ఉందని ఆరోపించారు. కానీ తన వద్ద డబ్బులు లేవన్న జీవన్ రెడ్డి... ఓట్లు మాత్రం వేయాలని విజ్ఞప్తి చేశారు.