పసుపు, ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనాలి

పసుపు, ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనాలి

సీపీఐఎంఎల్ ​(ప్రజాపంథా) లీడర్ల డిమాండ్​ 

ఆర్మూర్, వెలుగు: పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐఎంఎల్​(ప్రజాపంథా) లీడర్లు డిమాండ్ చేశారు. ఆర్మూర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్, సహాయ కార్యదర్శి బి.దేవారం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మెనిఫెస్టో, వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రైతులు పండించిన అన్ని రకాల పంటలను కొంటామని, పంటలకు క్వింటాల్​కు రూ.500 బోనస్ ఇస్తామని, పసుపు క్వింటాలుకు రూ.12వేలు, ఎర్రజొన్నలు క్వింటాలుకు ర.3,500 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని చెప్పారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్​చేశారు. రైతుభరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.15,000 వెంటనే అమలు చేయాలన్నారు. ఆర్మూర్ డివిజన్ లో మహిళలతో పాటు అనేకమంది రైతులపై బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి, ఇబ్బందులు పెట్టిందని, ఆ కేసులను రద్దు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు సారా సురేశ్, ఆర్మూర్ డివిజన్ నాయకులు రాజన్న, ఆకుల గంగారం, గంగాధర్ పాల్గొన్నారు.