గురుకుల విద్యార్థులను సర్కారు ఆదుకోవాలి

గురుకుల విద్యార్థులను సర్కారు ఆదుకోవాలి

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అనీ, ఎలుకలు కరిచాయనీ, పాములు సంచరిస్తున్నాయనీ.. కరుస్తున్నాయనీ  నిత్యం వార్తలు వస్తున్నవి.  రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా గురుకులాల్లో 36 మంది విద్యార్థులు  వివిధ కారణాల వల్ల చనిపోయారని, సుమారు 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారని వార్తా పత్రికలు,  సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తున్నది. ములుగు జిల్లా కేంద్రంలోని  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. దీంతో విద్యార్థిని నడుం భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం నిమ్స్​లో ఐసీయూలో చికిత్స పొందుతున్నది. 

గాయపడిన కార్తీకకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అండగా ఉంటామని ప్రకటించారు. ప్రభుత్వ ఖర్చుతో  పూర్తి వైద్యం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఇది సంతోషమే. అయితే, విద్యాశాఖ అత్యంత ప్రధానమైన వాటిల్లో ఒకటి  కావున విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఇటీవల జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇద్దరు విద్యార్థులను చనిపోవడం బాధాకరం అనీ భావోద్వేగానికి గురయ్యారు.  బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.  గత  కేసీఆర్  ప్రభుత్వం పదేండ్లలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం తెలిసిందే కదా! అందుకే వాళ్లను ప్రజలు శంకరగిరి మాన్యాలకు పంపారు.  కాగా, చనిపోయిన చిన్నారులు అనిరుధ్,  గుణాదిత్య కుటుంబాలకు రూ. ఇరవై ఐదు(25) లక్షల చొప్పున పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. 

బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు అక్రోశం

చదువు నేర్పుతారని ఆశించి గురుకులాలకు పంపిస్తే చదువు నేర్పడం ఏమో కానీ కాటికి పంపుతున్నారని బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు అక్రోశంతో ఉన్నారు. వివిధ గురుకులాలు సందర్శించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,  మంత్రి పొన్నం ప్రభాకర్.. గురుకులాలు, హాస్టళ్లలో  నెలకొన్న దారుణమైన పరిస్థితులను వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. రాష్ట్ర రాజధాని నుంచి మండల స్థాయి అధికారులు,  ప్రజా ప్రతినిధులు అందరూ కదిలి పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు తనిఖీ చేయాలి, కేవలం ప్రిన్సిపాల్స్, హెచ్​ఎంలు, వార్డెన్స్ పైనే  నెపం మోపకుండా.. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆలోచించి తగు చర్యలు, నిధులు సమకూర్చాలి. వాటి బాగు కోసం కృషి చేయాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరుతోంది. 

ఒకరిద్దరిని బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేయడం, మెమోలు ఇవ్వడం చేసి చేతులు దులుపుకుంటే అది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. విద్యాలయాల్లో  నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకు అందరూ కారణమే! జరుగుతున్న పరిణామాలపై, ఈ మరణాలపై ఇప్పటివరకూ కూడా ప్రభుత్వంఏ స్థాయిలో కూడా సమీక్షలు జరగడం లేదు. విద్యార్థులు జబ్బు పడితే కనీస మందులు అందుబాటులో లేని పరిస్థితి కూడా ఉంది.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలపై పర్యవేక్షణ లోపించింది. ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో... ‘ఇకనుంచి కలెక్టర్లు కుర్చీలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు, తనిఖీలు చేయాలి’ అని ఆదేశించారు.  

ఆరోగ్య శిబిరాలు పెట్టాలి

తాజాగా బీబీపేట పాఠశాలలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు.  ఎంతో ఆశతో, నమ్మకంతో  పోటీ పరీక్షల ద్వారా సెలక్ట్ అయి గురుకులాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు నిరాశకు గురికాకుండా చూడాలి.  గురుకులాల్లో జ్వరాల నియంత్రణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.  ప్రతి గురుకులంలో అత్యవసర మందులు, పారామెడికల్ సిబ్బందినీ నియమించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో,  హాస్టళ్లలో,  గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలి.

పక్షం రోజులకొకసారి.. విద్యాసంస్థలను పర్యవేక్షించాలి

కనీసం పక్షం రోజులకొకసారి  రాష్ట్రంలోని  విద్యాసంస్థలను  అన్ని స్థాయిల  ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షించాలి.  రాష్ట్రస్థాయిలో ఎంట్రన్స్ పరీక్షలు రాసి గురుకులాల్లో సీటు సంపాదించిన విద్యార్థులు ఎంతో ఆశతో  నాణ్యమైన విద్య, భోజనం ఉంటుందని చేరుతున్నారు.  అలా గురుకులాల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. 

బయట ప్రచారం జరుగుతున్నట్లు  గురుకులాల్లో నాణ్యమైన భోజనం వసతులు అనేవి వట్టి మాటలని అర్థం చేసుకోవాల్సి వస్తుంది.  పాఠశాలల ఆవరణలలో విద్యార్థులు ఆందోళనకర పరిస్థితుల్లో గడుపుతున్నారు. అనారోగ్యానికి  గురైతే  డాక్టర్ అందుబాటులో లేక పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ పూజ అనే విద్యార్థిని టెన్త్ చదువుతోంది.  జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే  మహారాష్ట్రలోని చంద్రాపూర్లో  ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్​కు అంబులెన్స్​లో తరలిస్తుండగా మార్గమధ్యలో  పూజ మరణించింది. 

- ఇంజమూరి రఘునందన్ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
         బాలల హక్కుల సంక్షేమ సంఘం