కార్మికుల డిమాండ్లకు దిక్కేది

ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగ, కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. కొన్ని అమలై ఉండొచ్చుగాక.. కానీ మాట ఇచ్చి వెనక్కి తిరిగి చూడని హామీలను కూడా ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగులుగా రెండు లక్షలు పైగా పనిచేసేవారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కాంట్రాక్టు వ్యవస్థే ఉండదని, అందరినీ రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తయినా కేసీఆర్​అన్న మాటలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పీఆర్సీ ప్రకారం వారికి వేతనాలు ఇవ్వటం లేదు. ఎందుకంటే వారు అవుట్​సోర్సింగ్ సిబ్బంది.

గ్రామపంచాయతీల్లో

స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా, వినే నాథుడే లేడు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు దాదాపు 60 వేల మంది జులై 6 నుంచి నిరవధిక సమ్మె బాటపట్టారు. పీఆర్సీ నిర్ణయించిన వేతనాలు అమలుకు జీవో నెంబర్ 66 ను ప్రభుత్వం విడుదల చేసింది. 

దాని ప్రకారం స్వీపర్లకురూ.15,600, ఇతర క్యాటగిరి కార్మికులకు రూ.19 వేలు నుంచి రూ.31,640 వరకూ- ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, 8 గంటల పని, సెలవులు, ప్రమాద నష్టపరిహారం తదితర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని కోరుతూ వారు సమ్మెకు దిగారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జీపీలతో రాష్ట్రంలో మొత్తం12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జీపీల్లో పారిశుద్ధ్య పనుల కోసం ఉన్న కార్మికుల సంఖ్య 60 వేలు మాత్రమే. ఇప్పటి జనాభా ప్రకారం అయితే.. రెట్టింపు సంఖ్యలో కార్మికులను నియమించాల్సి ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు, కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు తగినట్టుగా గ్రామపంచాయతీలకు అదనపు సిబ్బందిని రాష్ట్ర సర్కారు నియమించడం లేదు. కొన్ని గ్రామపంచాయతీలు అదనపు సిబ్బందిని పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. వీరికి చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు అమలులో లేవు. సెలవులు, ఈపీఎఫ్, యూనిఫామ్, ఈఎస్ఐ, సబ్బులు, మంచి నూనె, చెప్పులు వంటి అలవెన్సులు ప్రభుత్వం ఇవ్వడం లేదు. 

మల్టీ వర్కర్స్ విధానం తీసుకొచ్చి..

రాష్ట్ర ప్రభుత్వం 51 జీవో ద్వారా మల్టీ వర్కర్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇది కారోబార్ నుంచి టెక్నికల్ సిబ్బంది వరకు అందరూ స్వీపర్ లాగా అన్ని పనులు చేయాల్సిన పద్ధతిని సూచిస్తున్నది. ఇది ఒక రకమైన నిరంకుశ విధానం. అన్ని పనులు అందరు చేయాలంటే ఎలా సాధ్యపడుతుంది? అందుకే వీటన్నిటికీ  వ్యతిరేకంగా గ్రామపంచాయతీ కార్మికులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి జులై 6 నుంచి సమ్మెకు దిగారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు సమ్మె చెదరగొట్టడానికి, గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదా? దాన్ని నెరవేర్చాల్సింది పోయి పని నుంచి  తీసివేస్తామని హెచ్చరించడం సరికాదు.

ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఆ స్కీం మిషన్ భగీరథలో పనిచేస్తున్న16 వేల కాంట్రాక్టు కార్మికులను ఏజెన్సీలకు అప్పజెప్పింది. ఆయా ఎజెన్సీలు అతి తక్కువ వేతనాలు ఇస్తూ, ఇతర అలవెన్సులు, సెలవులు ఏమీ అమలు చేయడం లేదు. ఇచ్చే అతి తక్కువ వేతనాలు 3,4 నెలలకు ఒకసారి ఇస్తున్నవి. అందుకే ఆ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ రెగ్యులర్ చేయాలని కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. వారి ఆర్తనాదాలు విన్నవారే లేరు. ప్రభుత్వం గతంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 23 వేల మంది వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా అమలు చేయడం లేదు. 

మధ్యాహ్న భోజన కార్మికులు

రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులదీ అలాంటి పరిస్థితే. మిడ్ డే మీల్స్ స్కీమ్​లో పనిచేస్తున్న 42 వేల మందికి నెలకు గౌరవ వేతనంగా వెయ్యి రూపాయలు మాత్రమే అందుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న ఈ స్కీంలో పనిచేస్తున్న వారికి గత అసెంబ్లీలో సమావేశంలో కేసీఆర్.. గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతామని ప్రకటించారు. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో కూడా వచ్చినప్పటికీ నిధులు విడుదలగాక అమలుకు నోచుకోలేదు. మిడ్ డే మీల్స్ బకాయిలతో పాటు పెరిగిన గౌరవ వేతనం ఇవ్వాలని కార్మికులు ఆందోళన బాట పట్టారు.

ఇదీగాక మిడ్ డే మీల్స్ బిల్లులతోపాటు వారి వేతనాలు రూ.150 కోట్లు దాకా పెండింగ్ లో ఉన్నాయి. వీరికి గత ఎనిమిది మాసాలుగా వేతనాలు ఇవ్వటం లేదు. మిడ్ డే మీల్స్ కార్మికులకు ఇచ్చిన హామీని ఇప్పటికైనా అమలు చేయాలి.  రాష్ట్రంలో  మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్, వివిధ వింగ్​లలో పనిచేస్తున్న కార్మికులకు11వ పీఆర్సీ ప్రకారం వేతనాలను పెంచి చెల్లించాలి. దీనిపై ప్రభుత్వం జీవో 60 ని విడుదల చేసినప్పటికీ, అది అన్ని మున్సిపాలిటీల్లో అమలు కావడం లేదు. గత మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా  రూ.1000 వేతనం పెంచుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ అన్ని మున్సిపాలిటీల్లో అది అమల్లోకి రాలేదు. మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన హామీకి కూడా ఇప్పటి వరకు దిక్కులేదు.

రాష్ట్రవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 25 లక్షల మంది కార్మికులకు ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా వేతన సవరణలు చేయడం లేదు. నాలుగేండ్ల తర్వాత గత ఏప్రిల్ నెలలో కనీస వేతనాల సలహా బోర్డు అధికార పార్టీ సభ్యులతో వేసినప్పటికీ కనీస వేతనాలను సవరించి ఇవ్వాలనే ఆలోచనే లేదు. రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ పెన్షనర్ ఉద్యోగులు3 లక్షల మంది పీఆర్సీతోపాటు, ఈ హెచ్ ఎస్ స్కీమ్ అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని కోరుతున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ, కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి.

- ఉజ్జిని రత్నాకర్ రావు,ట్రేడ్​ యూనియన్​ లీడర్, ఏఐటీయూసీ