ఏ ప్రభుత్వమైనా సంక్షేమ, అభివృద్ధి పనుల కార్యాచరణ దిశగా నడక సాగించినప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు, ఆదరణను ఆ ప్రభుత్వం కైవసం చేసుకోగలదు. ప్రజా సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకుఅందేక్రమంలో ఎదురయ్యే సమస్యలను కొన్ని ప్రభుత్వాలు పరిష్కరిస్తే, మరికొన్ని చేయకపోవచ్చు. ఏ కార్యక్రమం అయినా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ఫలాలను అనుకున్న గమ్యాన్ని చేరాలంటే దానికి కావాల్సినది పటిష్ట నాయకత్వం. సత్వర ఫలితాల కోసం చేసే పనులు వల్ల కొన్ని సవాళ్లను ఎదుర్కోవడం కూడా జరగవచ్చు.
సామాజికంగా అన్నివర్గాల అభిప్రాయాలు, అన్నివర్గాల దృక్పథాలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయవు. ఎన్నికల నేపథ్యంలో మెజారిటీ ఓట్ల ప్రామాణికతగా అధికార ప్రభుత్వం మనుగడ కొనసాగుతున్నది. ప్రజాభిప్రాయాన్ని సమతుల్యం చేసే క్రమంలో జరిగేలోటుపాట్లు దశలవారీగా జరిగే కార్యాచరణలో కలిగే జాప్యం కారణంగా ప్రజల నుంచి ఏకాభిప్రాయాన్ని ప్రభుత్వం చూడకపోవచ్చు. అప్పుడు ఎదురయ్యే సవాళ్లను శీఘ్రంగా, న్యాయంగా పరిష్కరించినప్పుడే ఆ ప్రభుత్వం ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. సంఘజీవిగా మనిషి ఒక బాధ్యతగా తన అభిప్రాయాన్ని ఓటు హక్కు ద్వారా తెలియజేస్తాడు. మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకు సుస్థిర పాలనను అందించే ఏ ప్రభుత్వమైనా దీర్ఘకాలిక రాజకీయ సుస్థిరతను సాధిస్తుంది. ఆర్థిక వనరుల దృష్ట్యా ఒక ప్రణాళికాబద్ధంగా పాలన కొనసాగాలని చేసే ప్రయత్నంలో నాయకుని పాత్ర కీలకంగా మారుతుంది.
అస్తిత్వాన్ని గౌరవించాలి
ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని అనుసరిస్తున్న అమెరికాలో ఇటీవల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అమెరికా ప్రెసిడెంట్ రేసులో కమలా హారిస్, ట్రంప్ మధ్య ఒకదశలో హోరాహోరీ పోటీ జరిగింది. దాదాపు సర్వే సంస్థలు అమెరికా ఎన్నికల చరిత్రను మరోసారి అంచనా వేసి 2000, 2016 సంవత్సరాల్లో మాదిరిగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కింపు ద్వారా ఎన్నికల ఫలితాల్లో స్పష్టత వస్తుందని, 2024లో కూడా అవే ఫలితాలు పునరావృత్తం అవుతాయని భావించాయి. కానీ, అందరి అంచనాల కంటే భిన్నంగా తుది ఫలితాలు నమోదయ్యాయి. రిపబ్లిక్ పార్టీ తరఫున బరిలో గెలిచిన ట్రంప్‌కు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తోపాటు పలువురు మద్దతుగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ పలు కారణాలతో అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తెరపైకి వచ్చారు.
చివరివరకు కమలా హారిస్ శాయశక్తులా పోరాడినా ఆమెకు ఓటమి తప్పలేదు. కమల నిర్ణయాలు, అభిప్రాయాలకు ప్రజలు మద్దతు తెలుపలేదా అనే ప్రశ్నకు భిన్నవాదనలు పరిశోధకుల నుంచి వెలువడుతున్నాయి. కాగా, ఏ ప్రభుత్వమైనా తమ అధికార ప్రాంత అస్తిత్వ విధానాన్ని సమగ్రంగా గౌరవించినప్పుడే సుస్థిరతను సాధిస్తుంది. అమెరికా ఎన్నికల ఫలితమే దీనికి ఉదాహరణ అని భావిస్తున్నా. ప్రజా సంగ్రామంలో వలసల స్వరాన్ని వినిపిస్తే అందులో వ్యక్తం అయ్యే తీవ్రత విభిన్న ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఆర్థిక, సంక్షేమ, భద్రతా రంగాలు ఒక దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాసంక్షేమంలో తన పాత్రను పరిపూర్ణంగా నిర్వహించాలి. ప్రజలు హర్షించేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కోవలో పాలన జరిగినప్పుడే ప్రభుత్వాలు ప్రజల మద్దతును చిరకాలం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వాలు ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంతోపాటు ఆ ప్రాంత ప్రజల అస్తిత్వాన్ని గౌరవించేవిధంగా పాలన కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాభిప్రాయానికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.
- డా. చిటికెన కిరణ్ కుమార్,
కవి, రచయిత