ఏజెన్సీ జీవోలకు రక్షణ కావాలి

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 6 న విడుదల చేసిన కొత్త జిల్లాల ఉద్యోగుల విభజన ఉత్తర్వు 317 ఏజెన్సీ ఉత్తర్వు నెం.3(2000)కు విఘాతం కలిగించింది. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం వల్ల ఏజెన్సీ జీవో 3 కు విరుద్ధంగా గిరిజనేతర ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారుగా 40 శాతం మంది ఏజెన్సీలోకి బదిలీ అయ్యారు. 317 జీవో వల్ల ఏజెన్సీ ప్రాతిపదిక బదిలీలు జరగక పోవడంతో 25 శాతం ఏజెన్సీ గిరిజనులు కూడా మైదాన ప్రాంతాలకు బదిలీ కావాల్సి వచ్చింది. దీంతో గిరిజనులకు కనీసం 10 శాతం ఉద్యోగ ఖాళీలు కూడా మిగిలేలా లేవు. భవిష్యత్తులో ఏజెన్సీ టీఆర్టీకి అవకాశం ఆమడ దూరమే !  317 జీవో వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు దక్కాల్సిన ఉద్యోగాలకు ఇక తీవ్ర నష్టం జరిగినట్లే. ఏజెన్సీ జీవో 3 అన్యాక్రాంతమే. ఏజెన్సీ జీవో విడుదలై 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ ఉత్తర్వు గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఏర్పడింది.

విద్యాశాఖలో జీవో 3 ఏమేరకు అమలైంది?

భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతానికి చెందిన ఉమ్మడి రాష్ట్రంలోని ఏజెన్సీవాసుల ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన జీవో నెంబర్ 3ను సుప్రీం కోర్టు 2020, ఏప్రిల్ 22 న స్టే విధిస్తూ ఏజెన్సీవాసులకు కేవలం 50 శాతం రిజర్వేషన్ పరిమితి  విధించింది.  ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317  వల్ల, ఏజెన్సీ జీవో 3కు సంపూర్ణ గ్రహణం పట్టింది. రాష్ట్రంలోని  గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు, ఉద్యోగ నియామకాలు చిరకాలంగా అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. ఏజెన్సీ స్థాయి ఉద్యోగాలకే గిరిజనులు పరిమితం కావడం తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేషన్​కు విరుద్ధంగా తహసీల్దార్, ఎంపీడీవో, ఎఫ్ఆర్వో స్థాయి పోస్టుల్లో నియమితులవుతున్న ఏజెన్సీ వారు ఏనాడైనా వ్యతిరేకించారా? భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ అనుసరించి 1986లో జారీ అయిన  ఏజెన్సీ జీవో నెంబర్ 275 , జీవో 3 లను గిరిజనేతరులు ఆది నుంచి అడ్డుపడటం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడమే. ఏజెన్సీగూడేల్లో  విద్యావసతులు, నియామకాలు, పదోన్నతులు వాటి పర్యవేక్షణకు సంబంధించి 1986 నుంచి 2022 వరకు నెలకొన్న పరిస్థితులు చూస్తే ఏజెన్సీలో  ‘అడవి కాచిన వెన్నెల’ ను స్ఫురింపజేస్తున్నాయి. గడిచిన 22 ఏళ్లలో ఏజెన్సీ ప్రాంతాల్లో  స్థానిక ఆదివాసీలకే 100 శాతం ఉద్యోగాలు కల్పించే జీవో 3 ప్రకారం విద్యాశాఖలో 50 శాతం కూడా భర్తీ
కాలేదంటే ప్రభుత్వ  వైఫల్యం అక్షర సత్యం. ఏజెన్సీపై ప్రభుత్వ ఉదాసీనతకు తోడు అధికారుల అలసత్వం రాజకీయ జోక్యం వెరసి ఏజెన్సీలో విద్యా , సంక్షేమ , ఉద్యోగ నియామకాలు , పదోన్నతులు కూడా లొసుగులమయంగా మారాయి. 

తీర్పును మళ్లీ సమీక్షించాలి

ఉమ్మడి రాష్ట్రంలో దళిత గిరిజనుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే ఉత్తర్వు నెంబర్ 5(2003 నుంచి)అమలవుతున్న దృష్ట్యా జీవో నెంబర్ 3 ప్రకారం ఏజెన్సీలో ఉపాధ్యాయ పదోన్నతులకు మార్గం సుగమం అయింది. ఏజెన్సీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ హెడ్మాస్టర్ పదోన్నతులు కూడా జీవో 3 ప్రకారం ఏజెన్సీ వారికి కేటాయించాలని ఏపీ ట్రిబ్యునల్ 2009 ఆగస్టు 10న ఇచ్చిన తీర్పు దరిమిలా గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు  19 డిసెంబర్, 2009 లో మెమో నెంబర్  9206 జారీ చేశారు. గిరిజనేతర ఉపాధ్యాయులు అదే ట్రిబ్యునల్ లో అనుకూల తీర్పు తెచ్చుకున్నారు. ఏజెన్సీ ఉపాధ్యాయులు  రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేయగా ఏజేన్సీవారికి జీవో నెంబర్ 3 ప్రకారం పదోన్నతులు సబబేనని 2011 డిసెంబర్ 28న హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తద్వారా పాఠశాల విద్యా సంచాలకులు ఆర్సీ నెంబర్164/డి3 - 2/2012 ద్వారా వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల కొన్ని గిరిజన జిల్లాల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు కూడా లభించాయి. 18 ఏళ్ల తర్వాత జీవో నెంబర్ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన అననుకూల తీర్పు వల్ల 29 రకాల ఏజెన్సీ ఉత్తర్వులపై ప్రభావం పడనుంది. రాజ్యాంగ పరంగా దక్కాల్సిన ఏజెన్సీ ఉద్యోగాలపై ఇచ్చిన ఈ వ్యతిరేక తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాలు  చొరవ తీసుకొని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి మూడేండ్లు గడుస్తున్నా.. ఏ తీర్పు రాకపోవడంతో ఇరు రాష్టాల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ఏజెన్సీ ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతున్నది.

జీవోకు గ్రహణం పట్టించారు

కేంద్ర ప్రభుత్వం 1998లో ఐపాడ్ నిధులతో ప్రతి గిరిజన గూడానికి/ గిరిజన గుంపుకు  గిరిజన విద్యా వికాస కేంద్రాలు (జీవీవీకే) మంజూరు చేసింది. ఏజెన్సీ జీవోననుసరించి పాఠశాలకు రెండు కిలోమీటర్లు లోపు ఉన్న స్థానిక గిరినివాసులతోనే భర్తీ చేసి వారికి తగిన శిక్షణ(డీఎడ్) కూడా ప్రభుత్వమే ఇప్పించింది. ఈ జీవీవీకే నియామకాల్లో కొందరు నాన్​ ఐఏఎస్ ప్రాజెక్టు అధికారులు అక్రమాలకు పాల్పడ్డ సంఘటనలు లేకపోలేదు. గిరిజనేతరులు ఈ జీవోను సుప్రీంకోర్టులో మళ్లీ సవాలు చేయగా కోర్టు జీవో నెంబర్ 275ను1998 లో మరోమారు రద్దు చేసింది. చివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని  కొన్న విధానపర సవరణలు  చేసుకొని చట్టపరమైన అడ్డంకులు రాకుండా టి. ఎ. సి. ని సంప్రదించి  ప్రభుత్వం పటిష్టమైన  జీవో  ఎం.ఎస్. నెం. 3 ను తేదీ:  1, జనవరి,2000న జారీ చేసింది. 5వ షెడ్యూల్ లోని 342(1 )అధికరణ ప్రకారం 1950, జనవరి 26 నుంచి అటవీ ప్రాంతంలో స్థిర నివాసం ఉన్న గిరిజనులు మాత్రమే జీవో 3 కు అర్హులు అవుతారు. కాబట్టి  జీవో 3 అనుసరించి తొలిసారిగా వెయ్యి పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసి ఏజెన్సీ వారిని నియమించింది. ఈ జీవో నెంబర్ 3 ను కూడా గిరిజనేతరులు ట్రిబ్యునల్​లో సవాల్ చేయగా 19 సెప్టెంబర్​2000 రోజున జీవో నెం 3 రద్దయింది.  ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు సోంది వీరయ్య హైకోర్టులో పిటిషన్ వేయగా తిరిగి జీవో నెం 3ను 23 నవంబర్ 2001 నుంచి పునరుద్ధరించారు. కానీ 2001 తర్వాత డీఎస్సీకి అప్పగించడంతో ఎన్​సీఈఆర్టీ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ  శిక్షణలేని గిరిజనులు ఉద్యోగాలు పొందలేకపోయారు. వాటిని ఏజెన్సీలో లేని గిరిజనేతరులతో నియమించారు. ఈ తప్పిదం వల్లే  డీఎస్సీ 2002 నుంచి డీఎస్సీ 2006 వరకు జీవోను అధికారులు సక్రమంగా అమలు చేయలేదు. దీని వల్ల వేలాది ఏజెన్సీ ఉద్యోగాలు  బ్యాక్ లాగ్ గా మిగిలి జీవోకు వీడని గ్రహణం పట్టింది. మరో పక్క గిరిజనేతరులు, మైదాన గిరిజనులు ఎమ్మార్వోలతో అక్రమ సర్టిఫికెట్లు పొంది జీవో 3 కు తూట్లు పొడిచారు.
- గుమ్మడి
 లక్ష్మీనారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక