
బెల్లంపల్లి, వెలుగు: అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గడ్డం వినోద్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. వారి ఆందోళనకు మద్దతు పలికి మాట్లాడారు. అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మ రించారని ఆయన విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలను రెగ్యులర్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల మల్లయ్య, మత్తమారి సూరిబాబు, కారుకూరి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.