విద్య, విద్యార్థులపై సర్కారు నిర్లక్ష్యం వీడాలె

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు చదువులో రాణిస్తూ ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్​ఐటీలో సీటు సాధిస్తున్నారు. తరతరాల వెనుకబాటును అధిగమించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని, సమాజ అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించాలని ఎన్నో కలలతో అక్కడికి వెళ్తున్న వారికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు ఎంతో విశేషంగా నడిచిన ట్రిపుల్​ఐటీ, ఇయ్యాల సర్కారు పట్టింపులేక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కనీస సౌలత్​లు కూడా లేవని విద్యార్థులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తున్నా.. ఆచరణలో కనిపించకపోవడంతో సమస్య యదాతథంగా కొనసాగుతోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీకు సంస్థను నడపడం చేత కాకపోతే తప్పు కోండి. తల్లిదండ్రులుగా ఈ సంస్థను కాపాడుకుంటాం. మీ నిర్లక్ష్యంతో మంచి పేరున్న విద్యా సంస్థను భ్రుష్టు పట్టించకండి” అని ఇటీవల నిర్వహించిన సమావేశంలో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారుకు బదులిచ్చారు. సంజయ్​అనే వరంగల్​కు చెందిన విద్యార్థి ఫుడ్​ పాయిజన్​ ఘటనను గుర్తుకు తెచ్చుకున్న ఓ తల్లి తీవ్ర ఆవేదనతో ‘‘కలో గంజో  పోసుకుని మా పిల్లలను సాదుకుంటాం కానీ, మీరు పెట్టే కలుషిత ఆహారంతో మా పిల్లలను బలి ఇవ్వదలచుకోలేదు’’ అని మండిపడ్డారు. ‘అన్న క్యాంపస్​లో ఉండాలంటే భయమైతంది. చదువు మీద ఆసక్తి పోతుంది’ అని కొత్తగా చేరిన ఓ విద్యార్థి తన పైక్లాసు విద్యార్థితో మాట్లాడిన ఫోన్​ రికార్డింగ్​తల్లిదండ్రులను కలిచివేసింది. 

అన్నీ సమస్యలే..

దాదాపు 9 వేల మంది చదువుకుంటున్న బాసర ట్రిపుల్​ఐటీలో తినే తిండి, మంచి నీళ్ల నుంచి మొదలు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా టైంలో వాడిన పరుపులు, బెడ్ షీట్లను మార్చలేదని కొందరు విద్యార్థులు నేలపైనే పడుకుంటున్నారు. కొన్ని గదుల కిటికీలకు తలుపులు లేక వాన, చలికి ఇబ్బంది పడుతున్నారు. పూర్తి కాలం వీసీ లేరు. నాసిరకం భోజనం, తాగడానికి, వాడుకోవడానికి సరిపడా నీళ్లు లేవు. హాస్టల్, క్లాస్​రూమ్స్​ శానిటైజ్ చేయలేదు. ల్యాబ్ అసిస్టెంట్లతో క్లాసులు చెప్పించడం వల్ల  కేంద్ర కౌన్సిల్ ట్రిపుల్​ ఐటీకి ‘సీ’ సర్టిఫికెట్ ఇచ్చిందని, దాని వల్ల ఇక్కడ పాసైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అవసరమైన ప్రొఫెసర్లను, లెక్చరర్లను నియమించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం, ఫిజికల్ ​డైరెక్టర్ల నియామకం చేపట్టాలని కోరుతున్నారు. రేకుల షెడ్లలో కొనసాగుతున్న క్లాస్​రూమ్స్,​మెస్​హాల్స్​కు పక్కా భవనాలు నిర్మించాలని, పాడైన కుర్చీలు, టెబుళ్లు, బ్లాక్ బోర్డులు, డెస్కులు, ఫ్యాన్ లు, ఏసీలకు రిపేర్లు చేయించి వాడుకలోకి తీసుకురావాలని అనేక సార్లు అధికారులకు చెప్తున్నా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. విద్యార్థులకు ల్యాప్​టాప్​లు ఇవ్వడం లేదు. 9 వేల మంది స్టూడెంట్స్​కు మూడే మెస్​లు ఉన్నాయి. ఇలా విద్యార్థుల డిమాండ్లన్నీ సాధారణమైనవి, అవసరమైనవే. ఇందులో గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. ఇవన్ని ఒక్కసారే వచ్చినవి కావు. కొన్నేండ్లుగా పేరుకుపోయినవి. సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు అడిగినా స్పందన లేకపోవడంతో స్టూడెంట్స్​శాంతియుతంగా పెద్ద ఉద్యమమే నిర్మించారు. తిండి తిప్పలు మానేసి రోజుల తరబడి ధర్నా చేస్తుంటే.. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బాసరకు వెళ్లి చర్చలు జరిపారు. అన్ని డిమాండ్లను 45 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింప చేశారు. పూర్తికాలం వీసీని నియమించకుండా ప్రభుత్వం ఇన్​చార్జి వీసీని నియమించింది. దీంతో ఆందోళన మళ్లీ మొదలైంది. 

గురుకులాల్లోనూ తిప్పలే..

గత రెండు నెలలుగా ఫుడ్​పాయిజనై విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న ఘటనలు బాగా పెరిగాయి. రాష్ట్రంలో కేజీబీవీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, మోడల్​స్కూళ్లు మొత్తం కలిపి దాదాపు1499 హాస్టల్స్ ఉంటాయి. వాటిల్లో 5,29,000 మంది విద్యార్థులు ఉంటున్నారు. కానీ ఆ విద్యార్థులకు భోజనం సహా ఇతర సౌలత్​లు సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సమయానికి నిధులు విడుదల చేయడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లను నిర్ణయించకపోవడంతో ఏజెన్సీలు సరుకులు, ఇతర వస్తువులను సరిగా సరఫరా చేయడం లేదు. దీంతో ఆ భారం అంతా ప్రిన్సిపాళ్ల మీద పడుతోంది. వారు పైఅధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. పైగా ప్రిన్సిపాల్స్​ఏదో విధంగా మెస్ లను నడపాలని సర్కారు పెద్దలు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. తెలంగాణలో గురుకులాల విద్యార్థులు ఎన్నో విజయాలు సాధించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారు. వారి స్ఫూర్తితో గురుకులాల్లో చేరుతున్న విద్యార్థులకు అన్ని సౌలత్​లు కల్పించాలి. సమస్యలు తీర్చి పరిస్థితిని చక్కదిద్దాలి. లేదంటే గురుకులాల్లో అత్యధికంగా చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లల చదువుపట్ల ప్రభుత్వానికి, రాష్ట్ర సీఎంకు చిత్తశుద్ధి లేదని తేలిపోతుంది. బర్లు, గొర్లు ఇతర పథకాలు ఇచ్చి ఈ వర్గాల పిల్లలను విద్యకు దూరం చేస్తున్నారనే వాదనలకు బలం చేకూరినట్లు అవుతుంది. ఈ వాదన నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది!.

సరిపడా నిధులు ఇయ్యకనే..

బాసర ట్రిపుల్​ఐటీ సమస్యలన్నీ నిధులతో ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం ఈ సంస్థకు సరిపడా నిధులు ఇవ్వడం లేదు. గత తొమ్మిదేండ్లుగా మొత్తం రూ.1161 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా, అందులో రూ. 430 కోట్లు ఆమోదించిన ప్రభుత్వం కేవలం రూ. 294 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అందుకే క్యాంపస్ లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక అంచనా ప్రకారం దాదాపు రూ.150 కోట్లు తక్షణం అవసరమని తెలుస్తోంది. ఆ నిధులు కేటాయించి విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించడానికి పూనుకోవాలి తప్ప అణచివేత ధోరణి ప్రభుత్వానికి మంచిది కాదు. హాస్టల్స్ ఏజెన్సీ లకు పెండింగ్ బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలి. తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బందితో పర్యవేక్షక కమిటీలను వేయాలి. ప్రతి నెలకు ఒక సారి సమీక్షలు జరపాలి. దీనికి తోడు సామాజిక తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మౌలిక వసతులకు ఎమర్జెన్సీ ఫండ్ ను విడుదల చేయాలి. ఏటా నిత్యావసర వస్తువుల ధరల మీద సమీక్ష నిర్వహించి మార్కెట్ ధరల ఆధారంగా చెల్లింపులు జరపాలి. అప్పుడే సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
ఊరటనిచ్చిన పర్యటన..

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా పరిస్థితిని సమీక్షించడానికి బాసర ట్రిపుల్​ఐటీకి వెళ్లడం మంచి పరిణామం. మామూలుగా ఉన్నత స్థాయి అధికారులు ఏ సంస్థ నైనా సందర్శించినప్పుడు అన్నీ బానే ఉన్నాయని ఆ రోజుకు పైపై మెరుగులతో సంతృప్తి పరచాలని చూస్తారు. కానీ కొన్నేండ్లుగా పేరుకుపోయిన సమస్యలు అయినందున అధికారులు గవర్నర్ దృష్టిని మరల్చలేకపోయారు. విద్యార్థులు వారి సమస్యలు గవర్నర్​తో చెప్పుకున్నారు. ఎంతో నిరాశతో ఉన్న వారికి ఈ పర్యటన కొంత ఉపశమనం ఇస్తుందనడంలో సందేహం లేదు. గవర్నర్​ పర్యటన రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రతిరోజు విద్యార్థులు పడుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. 

- ఆర్. వెంకట రెడ్డి,
జాతీయ కన్వీనర్, 
ఎం. వి. ఫౌండేషన్