కెనడా పోలే.. ప్లాన్​ గీయలే.. వరంగల్​ ‘సూపర్ ​స్పెషాలిటీ’ ఏమాయె!

  • కెనడా పోలే.. ప్లాన్​ గీయలే..
  • ‘సూపర్ ​స్పెషాలిటీ’ ఏమాయె!
  • వరంగల్​లో మూడు రోజుల్లో జైలు కూల్చిన్రు    
  • హాస్పిటల్​ కట్టుడు మరిచిన్రు

వరంగల్‍, వెలుగు: ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ స్థలంలో ఏడాదిన్నరలో సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ కడతామన్న సీఎం కేసీఆర్‍ మాటలకు.. గ్రౌండ్‍ లెవల్​లో పనులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. మూడు నెలల కింద కేసీఆర్‍ శంకుస్థాపన కోసం వచ్చిన రోజు చేసిన హడావిడితో జనాలు నిజంగానే హాస్పిటల్‍ వర్క్స్​ జరుగుతాయని భావించారు. కానీ నాటి నుంచి నేటి వరకు పిడికెడు మట్టి కూడా తీయలేదు. శంకుస్థాపన చేసిన ఏరియాకు ఎవరూ వెళ్లకుండా గేటుపెట్టి తాళం వేశారు. 

నెలలో పంపిస్తమన్నరు
‘దేశంలో ఎక్కడా లేనివిధంగా వరంగల్‍ జిల్లాలో 200 ఎకరాల్లో గొప్ప హెల్త్ సెంటర్‍ నిర్మిస్తాం. సెంట్రల్‍ జైల్‍ పడగొట్టి 56 ఎకరాల్లో సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నాం. 33 అంతస్తుల్లో కడదామని ప్లాన్‍ చేశా. రూ. 2 వేల కోట్ల నుంచి 3 వేల  కోట్లు ఖర్చయినా పర్లేదు. ఇండియాలో ఎక్కడా దొకరని ట్రీట్‍మెంట్‍ ఇక్కడ దొరికేలా అన్ని ఫెసిలిటీస్‍ ఉండాలె. ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడిన ఒక టీం నెలలో కెనడా దేశం పోవాలె. అక్కడి 24 అంతస్తుల హాస్పిటల్‍ ఎలా కట్టిన్రో స్టడీ చేయాలె. ఫోటోలు, వీడియోలు తీసుకోవాలె. టైం వేస్ట్ చేయకుండా దానిని తలదన్నెలా పనులు మొదలు పెట్టాలె. చైనాలో ఎవడో 28 గంటల్లో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టిండంటా. అవసరమనుకుంటే ఆ కట్టినోన్ని పట్టుకురండి. పది రూపాయలు ఎక్కువైనా ఫర్వాలేదు. ఏడాదిన్నరలో సూపర్‍స్పెషాలిటీ హాస్పిటల్‍ కట్టుడు పూర్తయ్యేలా టార్గెట్‍ పెట్టుకోవాలి. మళ్లీ నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తా’ అంటూ జూన్‍ 21న హాస్పిటల్‍ పనులకు శంకుస్థాపన చేసిన టైంలో సీఎం కేసీఆర్‍ అన్నారు. ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కెనడా పోయిచ్చినంక టైం వేస్ట్ చేయకుండా సీనియర్‍ అర్కిటెక్ట్​లతో అద్భుతమైన బిల్డింగ్‍ స్ట్రక్చర్‍ గీపిస్తామన్నారు. ఫ్యూచర్‍ని దృష్టిలో పెట్టుకుని ఎంత స్థలంలో హాస్పిటల్‍ ఉండాలో.. ఎక్కడ పార్కింగ్‍ రావాలనే విషయంలో కేర్‍ తీసుకోనున్నట్లు వెల్లడించారు. నెల టైంలో ఇవన్నీ చేస్తామని సీఎం చెప్పినా... 100 రోజులు పూర్తయినా ఆ దిశగా అడుగులు పడడం లేదు. 

సెంట్రల్ ​జైలూ కడ్తలేరు
వరంగల్‍ సెంట్రల్ జైల్‍ కూల్చివేసిన అధికారులు ఖైదీలను హైదరాబాద్‍, ఖమ్మం జైళ్లకు తరలించారు. గతంలో ములాఖత్ ద్వారా  ఖైదీలను కలిసేందుకు వచ్చే వారి భార్యా పిల్లలు ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం వెళ్లి తమవారిని చూడలేక కన్నీరు కారుస్తున్నారు. అదే సమయంలో చిన్నచిన్న కేసుల్లో పట్టుబడేవారిని హైదరాబాద్‍, ఖమ్మం ఇతర జిల్లాల్లోని జైళ్లకు తరలించడం కోర్ట్ డ్యూటీల్లో ఉండే పోలీసులకు తలనొప్పిగా మారింది. పోనీ.. కొత్త సెంట్రల్‍ జైల్‍ కట్టే విషయంలో ప్రభుత్వం జెట్‍ స్పీడ్‍తో పనులు చేస్తుందా అంటే కనీసం ఆ పనులకు కొబ్బరికాయ కూడా కొట్టలేదు.

135 ఏండ్ల జైలు 3 రోజుల్లో ఖతం
హాస్పిటల్​ నిర్మాణానికి ప్లాన్​ రెడీ చేయకుండానే 135 ఏండ్ల నాటి వరంగల్​సెంట్రల్‍ జైల్‍ను మూడు రోజుల్లో సీక్రెట్‍గా నేలమట్టం చేశారు. అంతకుముందు జైళ్ల శాఖ డీజీ రాజీవ్‍ త్రివేది దగ్గరుండి మరీ వారం రోజుల్లో అందులోని 956 మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు. 267 మంది స్టాఫ్‍ను రాష్ట్రంలోని ఇతర జైళ్లలో సర్దుబాటు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో జేసీబీలుపెట్టి 27 బ్యారక్స్, 6 వాచ్‍ టవర్స్, 6 ఆఫీసర్‍ క్వార్టర్స్, 80 స్టాఫ్‍ క్వార్టర్స్,  ఖైదీల ట్రీట్‍మెంట్‍కోసం ఉన్న 50 బెడ్ల హాస్పిటల్‍ను మూడు రోజుల్లో నామ రూపాల్లేకుండా కూల్చి వేశారు. సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ కట్టడంపై సరైన ప్లానింగ్ ​లేదనే విషయం మంత్రులు, సీఎం మాటలను బట్టి తేటతెల్లమైంది. సీఎం వరంగల్‍ రావడానికి ముందు మూడు రోజుల ముందు కూడా 24 అంతస్తుల్లో హాస్పిటల్‍ కడతామని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారు. తీరా శంకుస్థాపన అయ్యాక ఏర్పాటు చేసిన మీటింగ్‍లో సీఎం మాట్లాడుతూ.. కెనడాలో 24 అంతస్తుల బిల్డింగ్‍ ఉందని.. దానిని తలదన్నేలా వరంగల్​లో 33 అంతస్తుల్లో కడుతామని కేసీఆర్‍ ప్రకటించారు. ఈ లెక్కన శంకుస్థాపన చేసే సమయానికి ప్రభుత్వానికి ఈ విషయంలో ప్రాపర్‍ ప్లాన్‍ లేదనేది స్పష్టమైంది.