నగదు సహాయం సరే..రైతుల దుస్థితి మాట ఏమిటి?

నగదు సహాయం సరే..రైతుల దుస్థితి  మాట ఏమిటి?

ఎరువులకు, విత్తనాలకు రాయితీలు ఇచ్చే సబ్సిడీల వల్ల ఆయా ముడి పదార్థాల వినియోగం మాత్రం పెరిగింది. కొన్ని చోట్ల అధిక వ్యవసాయ దిగుబడులు వచ్చాయి. వ్యవసాయ కుటుంబాలలో కొంత స్థిరమైన ఆదాయం కనపడింది. అయితే రైతుల పేదరికంపై ఈ సబ్సిడీలు పరిమితంగా ప్రభావం చూపెట్టినాయి. హరిత విప్లవం పేరు మీద మొదలు పెట్టిన వ్యవసాయ విధానంలో ప్రధాన భూమిక  ఆద్యంతం రైతులకు ఎరువులు, రసాయనాలు, హైబ్రిడ్ విత్తనాలు అలవాటు చేసే లక్ష్యంతో ఇస్తున్న సబ్సిడీలవే. ప్రభుత్వం ఇస్తున్న రైతులకు ఇచ్చే సబ్సిడీల మీద ఆయా కంపెనీలు లాభాల బాట పట్టినాయి.

రైతులను అప్పుల భారం నుంచి విముక్తి చేయడానికి, అప్పుల బారిన పడకుండా నివారించడానికి 10 మే 2018 నాడు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు  ప్రారంభించింది. రైతుల ఆత్మహత్యలకు దారితీసిన సంక్షోభ ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ పథకం అవసరం ఏర్పడింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌‌‌‌మెంట్ (నాబార్డ్) 2016-–17 సర్వేలో జాతీయ రేటు 52.5% ఉండగా, అత్యధికంగా తెలంగాణ రైతులు (79%) అప్పుల పాలవుతున్నారు. మొదలు పెట్టిన 2018–-19 సంవత్సరంలో పథకం బడ్జెట్ రూ.12000 కోట్లు. తరువాత సంత్సరాల్లో ఇది పెరిగింది. 2018లో కొత్తగా ఎన్నికైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‌‌‌గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులందరూ రుణమాఫీని ప్రకటించారు. మొత్తంగా రాష్ట్ర ఖజానాకు రూ.50,000 కోట్లకు పైగా భారం అని అప్పటి లెక్కలు.

పెరిగిన ఉత్పత్తి ఖర్చుకు రైతు బంధు సరి

OECD-ICRIER నివేదిక ప్రకారం, 2000–-01 నుంచి 2016-–17 మధ్య కాలంలో స్థూల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విలువలో 14 శాతం వరకు రైతులకు కనపడని పన్ను (ఇంప్లిసిట్ టాక్స్) పడింది. అంటే రకరకాలుగా 14 శాతం ఆదాయం కోల్పోయారు. తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కలుగుతున్న నష్టం గత 4 ఏండ్లుగా చూస్తున్నాం. రైతు బంధు క్రింద ఇస్తున్న పైకం చిన్న , సన్నకారు రైతుల సగటు వార్షిక వ్యయంలో కేవలం 10%, మధ్యస్థ నుంచి పెద్ద రైతు సగటు వార్షిక వ్యయంలో 6% మాత్రమే. ఇప్పుడు రైతు భరోసా క్రింద రూ.14 వేలు అంటున్నారు. అదే సమయంలో వరి ఉత్పత్తి ఖర్చు ఎకరాకు 2019-–20 లో రూ.34 వేల నుంచి 2023-–24 నాటికీ రూ.45 వేలకు పెరిగింది. పత్తి ఉత్పత్తి ఖర్చు ఎకరాకు 2019-–20 లో రూ.35 వేల నుంచి 2023–-24 నాటికి రూ.45 వేలకు పెరిగింది.  రైతు బంధు క్రింద వచ్చింది అక్కడికక్కడకు సరిపోయింది. ఈ లెక్కన, అప్పు నుంచి తెలంగాణా రైతును విముక్తి చేసే సామర్థ్యం ఈ పథకానికి ఉన్నదా? 

ఇస్తున్న సబ్సిడీ మార్కెట్ల పాలు

2019లో వానాకాలంలో 1.19 కోట్ల ఎకరాలలో వరి వేస్తే, అందరికి రైతు బంధు వచ్చింది అనుకుంటే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రూ.4,760 కోట్లు (ఎకరా4 వేల చొప్పున). 2022లో వానాకాలంలో 1.24 కోట్ల ఎకరాలలో వరి వేస్తే, ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీ రూ.6,200 కోట్లు (ఎకరాకు 4 వేల చొప్పున). పంట వ్యయం పెరగడం వల్ల ఈ సబ్సిడీ రైతుకు చేరలేదు. ఎక్కడికి చేరింది? వ్యవసాయ మార్కెట్లకు చేరింది. ఎరువులకు, విష రసాయనాలకు, అప్పులకు, వడ్డీలకు, అవినీతికి చేరింది. ఈ వ్యవసాయ ముడి సరుకుల ధరలు పెరిగినాయి. వినియోగం పెరిగింది. నాణ్యత చచ్చింది. అందుకే రైతులు మొదటి నుంచి మొత్తుకునేది – మాకు ఏమి ఇవ్వవద్దు మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర ఇప్పియ్యమని. నాణ్యమైన వ్యవసాయ ముడి సరుకులు ఇప్పించే బాధ్యత తీసుకొని, మార్కెట్లో గిట్టుబాటు ధర ఇప్పించే ప్రభుత్వ విధానాలు కావాలి. కాని అవి తప్పితే అన్నీ ఇస్తామంటారు. ఆ ఇచ్చేది రైతు పేరు మీద ఆయా కంపెనీలకు చేరుతున్నాయి. రైతు బంధు లాంటి పథకాలు రైతుకు సుస్థిర ఆదాయం కొరకు కాదు. 

యజమానులకే తప్ప కౌలుదారులకేది?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అనేక రూపాల్లో, ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ సబ్సిడీల ద్వారా, వడ్డీ తక్కువ రుణాలు, రుణ మాఫీలు, కనీస మద్దతు ధర వంటి పథకాలు ఇస్తున్నాయి. గత ఐదేళ్లలో రైతులకు నేరుగా నగదు బదిలీలు చేస్తున్నాయి. ఈ పథకాలు ఎక్కువగా రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృతమై ఉన్నాయి. మధ్యంతర బడ్జెట్ 2019–-20 నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి  ద్వారా చిన్న , సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.6,000 నగదును నేరుగా బదిలీ చేస్తున్నారు. దాదాపుగా నగదు బదిలీ పథకాలు అన్ని లబ్ధిదారుల గుర్తింపు కోసం భూమి రికార్డులపై ఆధారపడుతున్నాయి. దాని వల్ల, ఈ పథకాలు కేవలం భూమి యజమానులకే పరిమితం అవుతున్నాయి. వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక వహిస్తూ, వ్యవసాయ సంక్షోభం వల్ల కష్టాల బారిన పడుతున్న, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు ఈ పథకాలు వర్తించడం లేదు. వారికి సంబంధించి ఎటువంటి పథకాలు లేవు. 

నగదు బదిలీతోనే సంక్షోభం పోదు

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార పథంలో ఈ నగదు బదిలీ అవసరమే. మొదటి అడుగే కావచ్చు. కాని దానితోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి లేదు. విపరీత వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల, ఏండ్లుగా రసాయనాలు వాడిన దరిమిలా నేల సారం తగ్గినందుకు రైతు పెట్టిన పెట్టుబడి మృగ్యం అయిపోతున్నది. నాణ్యమైన విత్తనాలు లేక దుక్కి దున్ని ఖర్చు పెట్టినాక గింజలు నాటితే మొలక రావడం లేదు. మొలకెత్తిన తరువాత వర్షాలు లేక ఎండిపోతున్నాయి. మొక్క ఎదిగినా కాయ కాయడం లేదు. కాయ కాసినా తగినంత దిగుబడి లేదు. నేల బాగుంటే పంట బాగుంటుంది. నేల కోతను అరికట్టడం, నేల సారం పెంచే అనేక పద్ధతులకు ప్రోత్సాహం ఇవ్వడం, కంపెనీలకు ఇచ్చే రసాయనిక ఎరువుల సబ్సిడీ బదులు స్థానిక సహజ ఎరువుల వ్యవస్థ పెరుగుదలకు దోహదపడేందుకు నిధులు ఇవ్వాలి. విత్తనాల రంగం ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పి నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నాయి.

రైతులను స్వావలంబన వైపు మళ్లించాలి

రైతు బంధు లాంటి పథకాలు శాశ్వతం కారాదు. రైతు రుణమాఫీ నిత్యం ఇవ్వలేరు. ఉపశమనానికి పనికి వస్తాయి కాని సమస్యల పరిష్కారానికి, నివారణకు ఇవి సరిపోవు. రైతులను స్వావలంబన వైపు తీసుకెళ్ళే ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు అవసరం. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వెయ్యాలి. వ్యవసాయంలో ముడిసరుకు కంపెనీలు, వాణిజ్య కంపెనీల పలుకుబడి, ప్రభావం తగ్గించే చర్యలు అవసరం ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తి ఖర్చు తగ్గించే చర్యలు చేపట్టాలి. సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తూ, రైతుల మీద, పేద వినియోగదారుల మీద భారం పడని వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థను నిలబెట్టాలి. రైతులకు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీటి అమలు తోటి ఆగవద్దు. వ్యవసాయం సంక్షోభం మూలాలలోకి వెళ్లి పరిష్కార దిశగా సహజ వ్యవసాయం, ప్రకృతి అనుకూల ఆహార ఉత్పత్తి మీద దృష్టి పెట్టాలి. 

- డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​