సర్కారు అటెన్షన్ కడెం.. నో టెన్షన్

సర్కారు అటెన్షన్ కడెం.. నో టెన్షన్
  • రికార్డు టైమ్​లో ప్రాజెక్టుకు రిపేర్లు పూర్తి
  • రూ.10 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
  • రెయిన్ గేజింగ్ స్టేషన్లు, సెన్సర్లతో వరదపై ఎప్పటికప్పుడు అంచనాలు
  • లోతట్టు ప్రాంతాలకు తీరిన ముంపు సమస్య
  • ఈసారి కూడా 3 లక్షల క్యూసెక్కులు దాటిన వరద

నిర్మల్, వెలుగు: ప్రతి ఏటా వర్షాకాలంలో డేంజర్ జోన్​లోకి చేరుకుంటూ ఏ సమయంలో కొట్టుకుపోతుందో అన్న ఆందోళన కలిగించే కడెం ప్రాజెక్టును ప్రభుత్వం ఆదుకుంది. దాదాపు మూడేండ్ల నుంచి లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి రావడంతో రిపేర్లు లేక, గేట్లు ఎత్తలేని పరిస్థితి తలెత్తడంతో ఓ దశలో ఏకంగా ప్రాజెక్టుపై నుంచి నీరు ప్రవహిం చింది. వరద ఉధృతికి గేట్లు, కౌంటర్ వెయిట్​లు సైతం కొట్టుకుపోయాయి.

పదేండ్లు పాలించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రిపేర్లకు నిధులు విడుదల చేయకపోవడంతో సమస్య ఏటేటా తీవ్ర మైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క ఈ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

దీంతో రిపేర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. గడువులోగా పనులు పూర్తికావాలంటూ అధికారులకు టార్గెట్ విధించారు. దీంతో అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి రికార్డు టైమ్​లో ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తిచేశారు. ఫలితంగా ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ దానికి అనుగుణంగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలకు, పంట పొలాలకు ఎలాంటి నష్టం వాటిల్లడం లేదు. దాదాపు 68 వేల ఎకరాల పంట భూములు, 14 లోతట్టు గ్రామాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి.

4 చోట్ల రెయిన్ ఫాల్ గేజ్ స్టేషన్లు ఏర్పాటు

ప్రతి ఏటా కడెం ప్రాజెక్టుకు ముప్పుగా మారుతున్న వరద ఉధృతిని తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు 4 చోట్ల రెయిన్ ఫాల్ గేజ్ స్టేషన్లును ఏర్పాటుచేసి, సెన్సర్ల ఆధారంగా ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. దీంతో వరద ఉధృతిని పక్కాగా లెక్కగట్టి దానికి అనుగుణంగా గేట్లను పైకెత్తుతూ నీటిని కిందకు వదులుతున్నారు. మొన్నటి వరకు ఈ స్టేషన్లు లేకపోవడంతో వరద ఉధృతిని కరెక్టుగా అంచనా వేయలేకపోయారు. 

ప్రస్తుతం మందపల్లి వద్ద ఉన్న పలికేరు వాగుపై, కడెం నది తాటికూడ, చిక్మాన్ వాగు, అలాగే కుప్టి వాగు వద్ద ఈ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గత ఆదివారం అర్ధరాత్రి ఎగువ నుంచి ఒక్కసారి ప్రాజెక్టులోకి దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో కొనసాగగా.. అధికారులు ఈ రెయిన్ గేజ్ స్టేషన్లు, సెన్సర్ల ద్వారా వరదను తెలుసు కుంటూ దిగువకు 2.78 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని వదిలారు.

యుద్ధప్రాతిపదికన రిపేర్లు

ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేయడంతో ప్రాజెక్ట్ అధికారులు మార్చిలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. గడువు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్స్​పర్ట్స్ బృందాలను రప్పించి ఇటు గేట్లకు రిపేర్లతోపాటు కౌంటర్ వెయిట్​ల ఏర్పాటు, గ్రీ జింగ్, రోప్స్, రోలర్స్ గేర్స్ బాక్స్, సీడీ డ్రమ్స్, లాంటి వాటి పనులను వేగంగా పూర్తిచేశారు. బేరింగులు, బేస్ లైనర్స్, మోటార్లకు ఆధునిక పద్ధతుల్లో రిపేర్లు చేశారు.

అలాగే 500 కేవీ ట్రాన్స్​ఫార్మర్, 180 కేవీ జనరేటర్ ను ఏర్పాటు చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి పనులు చేపట్టడంతో వర్షాకాలం మొదలుకాక ముందే పూర్తయ్యాయి. మరమ్మతులపై జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారం రోజులకోసారి సమీక్షలు జరపడంతో పనులు సకాలంలో పూర్తయ్యాయి.


రిపేర్లు పూర్తికావడంతోనే సమస్య ఏర్పడలేదు

ప్రభుత్వం నిధులను సకాలంలో విడుదల చేయడంతోనే అనుకున్న సమయంలో ప్రాజెక్టు రిపేర్లను పూర్తిచేశాం. రెయిన్ ఫాల్ గేజ్ స్టేషన్లు‌, సెన్సర్ల ఏర్పాటుతోనే వరద ఉధృతిపై పక్కా అంచనాలు వేయగలిగాం. వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేశాం. రాబోయే రోజుల్లో ఎంత పెద్ద మొత్తంలో వరద వచ్చినా దిగువకు నీటిని విడుదల చేసే విషయంలో ఇబ్బందులు తలెత్తవు.– రవికుమార్, ఏఈఈ, కడెం ప్రాజెక్టు