
- గ్రామాల్లో తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్న అధికారులు, టీచర్లు
- స్కూళ్లలో వేధిస్తున్న టీచర్ల కొరత.. ప్రైవేట్ వైపు మొగ్గుచూపుతున్న తల్లిదండ్రులు
- ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న సౌలత్లు
ఆదిలాబాద్, వెలుగు: సర్కార్ బడుల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది సైతం బడిబాట కార్యక్రమం చేపట్టింది. విద్యార్థుల అడ్మిషన్ల కోసం విద్యాశాఖ అధికారులు ఈనెల 3న కార్యక్రమాన్ని ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో రెండ్రోజుల గ్యాప్ తర్వాత గురువారం మళ్లీ మొదలైంది. ఈ కార్యక్రమం ఈనెల 19 వరకు కొనసాగనుండగా విద్యాశాఖ అధికారులు, టీచర్లు కలిసి గ్రామాల్లో తిరుగుతూ సర్కారు బడుల్లో అందిస్తున్న సౌలత్లను చిన్నారుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. అధికారులతో పాటు కలెక్టర్ రాజర్షి షా సైతం స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తూ పిల్లలను బడిలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒకటో తరగతితోపాటు ఐదో తరగతి పూర్తి చేసిన వారిని ఆరులో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వేధిస్తున్న టీచర్ల కొరత..
ఆదిలాబాద్జిల్లా వ్యాప్తంగా మొత్తం 762 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రైమరీ స్కూళ్లు 455, ప్రాథమికోన్నత 104, ఉన్నత పాఠశాలలు 113 ఉన్నాయి. మొత్తంగా 65 వేల మంది విద్యార్థులుండగా ఇప్పుడున్న టీచర్లు వారికి సరిపోవడం లేదు. జిల్లాలో ఏకంగా 577 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల కొరతతోనే విద్యార్థులను సర్కారు బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది.
దీనికితోడు సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. మరో వారం రోజుల్లో బడులు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో టీచర్ల కొరత ఎలా తీరుస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సమస్య తీరేందుకు విద్యావాలంటీర్లను నియమించాలని, లేదంటే మరే ఇతర మార్గమైనా చూడాలని సూచిస్తున్నారు.
ప్రైవేట్ వైపు మొగ్గు..
జిల్లాలో గత నెల రోజుల నుంచి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు గ్రామాలు, పట్టణాలను చుట్టేస్తున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులను ఒప్పిస్తూ పిల్లల అడ్మిషన్లు చేయిస్తున్నారు. సర్కార్ బడుల్లో టీచర్ల కొరత, మౌలిక వసతులు లేకపోవడంతోనే తమ పిల్లలను ప్రైవేట్ లో చేర్పిస్తున్నట్లు చాలా మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంగ్లీష్ మీడియం కూడా మరో కారణమని పేర్కొంటున్నారు.
సౌలత్ల కోసం చర్యలు
బడుల ప్రారంభం నాటికి స్కూళ్లలో అన్ని వసతులు కల్పించేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. మౌలిక సదుపాయాల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దాదాపు రూ.30 కోట్లతో జిల్లాలోని సర్కార్ బడుల్లో పనులు సాగుతున్నాయి. స్కూళ్ల ప్రారంభం నాటికి పనులు పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. గతంలో మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టినప్పటికీ అది కొన్ని స్కూళ్లకు మాత్రమే పరిమితమైంది. కానీ కొత్త ప్రభుత్వం అన్ని స్కూళ్లలో సౌలత్ లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
బడిబాట సక్సెస్ఫుల్గా సాగుతోంది
జిల్లాలో బడిబాట కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఈనెల 19 వరకు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న విద్యాబోధన, ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను వివరిస్తూ పిల్లలను బడుల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పిస్తున్నాం.
- ప్రణీత, డీఈవో