ఇక సోలార్ పంట.. సాగు చేయని భూముల్లో ప్లాంట్లు

ఇక సోలార్ పంట.. సాగు చేయని భూముల్లో ప్లాంట్లు
  • ఒక్కో ప్లాంట్ కు 0.5 నుంచి 2 మెగావాట్ల వరకు అవకాశం
  • జిల్లాకో వంద మెగావాట్లు కేటాయింపు
  • టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
  • అన్నదాతల ఆదాయం పెంచేలా సర్కారు చర్యలు

హనుమకొండ, వెలుగు: రైతుల భూముల్లో ఇక నుంచి సోలార్​ పంట పండనుంది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సోలార్ పవర్​ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, అన్నదాతలకు కూడా ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. రైతులకు సంబంధించిన బంజరు భూములు, సాగుకు యోగ్యంగా లేని ల్యాండ్​లో 'సోలార్​పవర్​ప్లాంట్లు' ఏర్పాటు చేసుకునేలా ఎంకరేజ్​చేస్తోంది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పీఎం కుసుమ్ స్కీం కింద సోలార్​ పవర్​ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ సోలార్​ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తును ఈఆర్సీ నిబంధనల మేరకు రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సోలార్​ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. 

జిల్లాకో వంద మెగావాట్లు..!

కేంద్ర ప్రభుత్వ 'ప్రధానమంత్రి కిసాన్​ఊర్జ సురక్షా ఏవం ఉత్థాన్​మహాభియాన్​(పీఎం కుసుమ్​)'లో భాగంగా రాష్ట్ర సర్కారు సోలార్​ కరెంట్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. తెలంగాణ రిన్యూవబుల్​ ఎనర్జీ డెవలప్​మెంట్​కార్పొరేషన్​(టీజీ రెడ్​కో)ను నోడల్​ఏజెన్సీగా నియమించి, సోలార్ విద్యుత్తు వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సోలార్​విద్యుత్తును తయారు చేసేందుకు ప్లాన్​రెడీ చేయగా, అందులో వెయ్యి మెగావాట్లను మహిళా సంఘాలకు అప్పగించింది. మిగతా 3 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే ప్లాంట్లను రైతుల పడావు భూముల్లో ఏర్పాటు చేయనుంది. 

సగటున జిల్లాకు వంద మెగావాట్ల చొప్పున కేటాయించింది. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 600 మెగావాట్ల సోలార్ పవర్​ జనరేట్​చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రాన్ని పైలట్​ప్రాజెక్టుగా ఎంపిక చేయగా, లీడర్లు, ఆఫీసర్లు స్థలాన్ని పరిశీలించారు. మిగతా జిల్లాల్లో కూడా పైలట్​ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేసిన సోలార్​ప్లాంట్లు పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

సాగుకు యోగ్యంగా లేని భూముల్లో..

రైతులు సాగు చేయకుండా వదిలేసిన బంజరు భూముల్లో సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేసి, దానితో అన్నదాతలకు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో చోట 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్​ను ఏర్పాటు చేయనుండగా, ఒక మెగావాట్​విద్యుత్తు ఉత్పత్తికి మూడున్నర నుంచి నాలుగెకరాల భూమి అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైతులు వీటిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం లోన్​ సౌకర్యం కల్పించనుండగా, ఈఆర్సీ టారిఫ్ మేరకు కిలోవాట్​పవర్​ను రూ.3.13 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది.

 అంతేగాకుండా 25 ఏండ్ల పాటు డిస్కంలే ఈ పవర్​ను కొనుగోలు చేయనున్నాయి. ఇదిలాఉంటే 33/11 కేవీ సబ్​స్టేషన్​కు దగ్గరగా ఉంటే విద్యుత్​ రవాణాకు లైన్​ ఖర్చులు తక్కువగా ఉంటాయి. రూల్స్ ప్రకారం అర్హులైన రైతులు 'www.tgredco.telangana.gov.in' వెబ్​సైట్ లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాగా, సోలార్​ప్లాంట్ల ఏర్పాటు విషయంలో జనాలకు వివరాలు అందించి, అవగాహన కల్పించాల్సిన రెడ్​ కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి..

రైతుల ఆదాయం పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే సోలార్​ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అర్హత ఉన్న రైతులు, రైతు సంఘాలు, డెవలపర్స్​ఎవరైనా ఈ నెల 22వ తేదీలోగా రెడ్​కో వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు సోలార్ ప్లాంట్లు సాంక్షన్​అయ్యే అవకాశం ఉంటుంది. 
- ఏ.విజేందర్​రెడ్డి, డీఈ, హనుమకొండ