
- ..మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుంచి ఉచిత శిక్షణ
- రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్, ఎమ్మెల్యే యెన్నం
పాలమూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మహమ్మద్ రియాజ్ స్పష్టం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో నిరుద్యోగ యువతకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల16 నుంచి ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన టెట్, డీఎస్సీ పరీక్ష కోసం, వీఆర్‌ఏ, వీఆర్ఓ, గ్రూప్ 1, 2, 3, 4 లాంటి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు పేరుతో 250 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించామన్నారు.
ఒక్క బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుని, రెండో బ్యాచ్ ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మహబూబ్ నగర్ ఫస్ట్ కోచింగ్ సెంటర్ అడ్మిషన్ ఫాంను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ తో పాటు ఫ్యాకల్టీ రవికుమార్, బాలరాజు, నాని యాదవ్, రాజేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.