
ఒకట్రెండు నెలల్లో సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్
అక్రమాలకు ఫుల్స్టాప్ పెట్టేలా కార్యాచరణ
హైదరాబాద్, వెలుగు: పింఛన్ల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. దీని కోసం సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆసరా లబ్ధిదారులంతా ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధాప్యం కారణంగా వేలి ముద్రలు సరిగా పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల పింఛన్దారులు మృతిచెందినా.. వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం లేదు.
దీంతో వారి పేరుపై ఇంకా పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, సెర్ప్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న యాప్ ను ఒకట్రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ యాప్ ను సెర్ప్ ఉద్యోగులకు అప్పగిస్తారా? పోస్టల్ శాఖకు అప్పగించి పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే వృద్ధులకు పింఛన్ కష్టాలు తొలగిపోవడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్టపడుతుంది.
రాష్ట్రంలో 42.67 లక్షల పింఛన్దారులు
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42.67 లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. అందులో వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ రోగులు, బోదకాలు బాధితులు, కళాకారులు ఇలా 11 కేటగిర్లీలో ప్రభుత్వం పింఛన్ ను అందజేస్తున్నది. దివ్యాంగులకు రూ.4,016 ఇస్తుండగా.. మిగిలిన వారికి రూ.2,016 అందజేస్తున్నారు. 2024–25 సంవత్సరంలో 42.67 లక్షల మందికి రూ.14,628.91 కోట్లు బడ్జెట్ కేటాయించగా.. ఇందులో ప్రతినెలా రూ.1000.47 కోట్లు పింఛన్ దారులకు చెల్లిస్తున్నది. పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ప్రామాణికంగా 22.72 లక్షలు (53 శాతం), బ్యాంకుల ద్వారా 19.95 లక్షలు (47 శాతం) పంపిణీ జరుగుతున్నది.
వృద్ధాప్య పింఛన్లు 15.25 లక్షలు, వితంతువులు 15.26 లక్షలు, దివ్యాంగులు 4.92 లక్షలు, గీత కార్మికులు 63 వేలు, చేనేత 36 వేలు, హెచ్ఐవీ బాధితులు 35 వేలు, డయాలసిస్ రోగులు 4 వేలు, ఫైలేరియా రోగులు 18 వేలు, బీడీ కార్మికులు 4.23 లక్షలు, ఒంటరి మహిళలు 1.41 లక్షలు, బీడీ టెకేదార్లు 4 వేల మంది పింఛన్ పొందుతున్నారు. అంతేగాకుండా, రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది. 23.39 లక్షల మంది బీసీలు పింఛన్ కు అర్హులుగా ఉండటంతో వారందరికీ అందజేస్తున్నారు. ఎస్సీలు 6.76 లక్షల మందికి, ఎస్టీలు 3.47 లక్షల మందికి, మైనార్టీలు 2.84 లక్షల మందికి, ఓసీలు 6.21 లక్షల మంది లబ్ధిదారులున్నారు. 28.05 లక్షల మంది మహిళా లబ్ధిదారులు పింఛన్ పొందుతున్నారు. కాగా, కొత్తగా సుమారు 8 లక్షలకుపైగా మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.