న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాన్ని సులభతరం చేసేందుకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కొత్త ఐటీ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఐటీ చట్టంలోని పేజీలను 60 శాతానికి పైగా తగ్గించాలని చూస్తోంది. గత ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న పాత ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం, 1961 లో 23 చాప్టర్‌లు, 298 సెక్షన్లు ఉన్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ఆరు నెలల్లో రివ్యూ పూర్తి చేస్తామని కిందటేడాది జులై బడ్జెట్‌లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కొత్త ఐటీ చట్టాన్ని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఇది పాత చట్టానికి సవరణ కాదు. పూర్తిగా కొత్త చట్టం. ప్రస్తుతం డ్రాఫ్ట్ చట్టాన్ని లా మినిస్ట్రీ పరిశీలిస్తోంది. పార్లమెంట్ సెషన్‌లోని సెకెండ్ హాఫ్‌లో ప్రవేశ పెట్టొచ్చు’ అని సంబంధిత వ్యక్తులు వివరించారు. కొత్త చట్టంపై 6,500 సలహాలను నిపుణులు, ఇతరుల నుంచి ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందుకుంది. ఈ ఏడాది బడ్జెట్ సెషన్స్ జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 న బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశ పెడుతుంది. జనవరి 31– ఫిబ్రవరి 13 మధ్య మొదటి దశ సమావేశాలు, మార్చి 10– ఏప్రిల్ 4 మధ్య రెండో దశ సమావేశాలు జరుగుతాయి.