'ఆత్మీయ భరోసా' అర్హుల గుర్తింపు.. ఫిబ్రవరి 2లోగా పూర్తి

'ఆత్మీయ భరోసా' అర్హుల గుర్తింపు.. ఫిబ్రవరి 2లోగా పూర్తి
  • మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు 
  • ఇప్పటికే 18 వేల మందికి నగదు జమ 

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ స్కీమ్ కు అర్హుల ఎంపిక ఫిబ్రవరి 2లోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2024–25 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద 20 రోజులు పని దినాలు పూర్తి చేసిన వారిని లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. జిల్లాల వారీగా అర్హుల ఎంపికలో డీఆర్డీవో అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులపాటు గ్రామ సభలు నిర్వహించగా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 

ఇందులో నుంచి అర్హులను గుర్తించి, వచ్చే నెల 2లోగా ఆన్​లైన్​లో నమోదు చేయనున్నారు. 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అర్హుల వివరాలు ఆన్ లైన్ లో ఎంటర్​చేయాలని.. ఆ తర్వాత ఇందులో ఎలాంటి మార్పుచేర్పులకు అనుమతించమని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ పథకం కింద ఇప్పటికే 18,180 మంది అర్హులను గుర్తించారు. వీరికి తొలి విడత కింద రూ.6 వేల చొప్పున మొత్తం రూ.10.90 కోట్లకు పైగా ప్రభుత్వం జమ చేసింది.