
- రాష్ట్రవ్యాప్తంగా 341 సెంటర్లు ఏర్పాటు
- మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపనున్న ప్రభుత్వం
- ఈ యాసంగిలో 8.41 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో సాగు
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో సాగైన మక్కలను కొనేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఉగాది తర్వాత నుంచి మక్కలు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లకు రాష్ట్రవ్యాప్తంగా 341 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈయేడు పెరిగిన పంట విస్తీర్ణానికి అనుగుణంగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
క్వింటాకు రూ.2,225 చొప్పున మద్దతు ధరతో ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయనుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి మక్కలు మార్కెట్‌కు వస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో మార్కెట్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్‌కు వస్తున్న మక్కలకు క్వింటా రూ.2,150 వరకు ధరతో వ్యాపారులు కొంటున్నారు. జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపుతున్నది.
23 లక్షల టన్నుల దిగుబడి అంచనా..
ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్లు లేదా సగటున 27.70 క్వింటాళ్ల మక్కల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు నమోదైన సాగు విస్తీర్ణం ప్రకారం 23.31 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 9.66 లక్షల టన్నులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉండగా, కనీసం 3 లక్షల టన్నుల మక్కలను రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మద్దతు ధరతో కొంటే ఎకరాకు అన్ని ఖర్చులు పోను రూ.50 వేల వరకు నికరాదాయం వస్తుందని రైతులు అంటున్నారు. యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 8.41 లక్షల ఎకరాల్లో మక్కలు వేసి రాష్ట్ర రైతులు రికార్డు సృష్టించారు.
యాసంగి మక్కల సాధారణ సాగు విస్తీర్ణం 5.69 లక్షల ఎకరాలు కాగా, నిరుడు ఇదే టైమ్‌కు 6.65 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈయేడు నిరుటి కంటే లక్షా 76 వేల ఎకరాలకు పైగా మక్కలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో వెల్లడించింది. 1,10,676 ఎకరాల్లో పంట సాగై ఖమ్మం జిల్లా టాప్‌లో ఉండగా, నిర్మల్ జిల్లా 1,05,041 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 1,02,321 ఎకరాల్లో సాగయ్యాయి. నీటి వసతి ఎక్కువగా లేని ప్రాంతాల్లో రైతులు యాసంగిలో మక్కలు ఎక్కువగా వేశారు.
మక్కల కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధం..
రైతుల నుంచి మక్కలు కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులు నష్టపోకుండా మద్దతు ధరకే మక్కలు కొంటాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. 26 జిల్లాల్లో మార్కెట్ ధరలను బట్టి కొనుగోలు సెంటర్లను ప్లాన్ చేస్తున్నాం.
శ్రీనివాస్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, మార్క్‌ఫెడ్