- మూసీ శుద్ధి కోసం గోదావరి జలాలను తరలించాలని సర్కార్ ప్లాన్
- ఇప్పటికే పీఎంకేఎస్‌వై కింద అప్లై చేసుకున్న రాష్ట్ర సర్కారు
- కఠిన నిబంధనల కారణంగా అంత ఈజీగా కేంద్రం ఒప్పుకోకపోవచ్చన్న అభిప్రాయాలు
- ఇంట్రా స్టేట్ లింకింగ్ కిందైనా కేటాయించేలా ఒప్పించాలన్న యోచనలో ప్రభుత్వం
- గత నెల జరిగిన ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగ్‌లో అధికారుల ప్రతిపాదన
హైదరాబాద్, వెలుగు: మూసీ శుద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. గోదావరి నీటిని తరలించి మురికిపట్టిన నదిని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దాని కోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. ఒకవేళ అది వీలుకాకుంటే ‘ఇంట్రా’ స్టేట్ రివర్ లింకింగ్ కిందనైనా గోదావరి–మూసీ నదులను అనుసంధానించి మూసీని ప్రక్షాళన చేయాలన్న యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తున్నది. మూసీ శుద్ధికి రెండింట్లో ఏదో ఒక దాని ద్వారా లబ్ధి పొందాలన్న ప్రయత్నాలను చేస్తున్నట్టు సమాచారం.
కేంద్రం సాయం అంత ఈజీ కాదట..
మూసీ శుద్ధి, సుందరీకరణను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లండన్‌లోని థేమ్స్ నదిలా మూసీని డెవలప్ చేయాలని సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే నది పొడవునా ఉన్న ఆక్రమణలను తొలగించి.. దానిని సుందరంగా మార్చి.. వాణిజ్య కార్యకలాపాలకు నదీ తీరం వెంబడి బిజినెస్ హబ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
ఆ ఆలోచనలో భాగంగానే కేంద్రం నుంచి లబ్ధి పొందేందుకు పీఎంకేఎస్‌వై కింద ప్రాజెక్టుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అయితే, దీని కింద కేంద్రం నుంచి సాయం పొందడం అంత సులువేం కాదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్కీమ్ కింద ప్రాజెక్టు ఓకే కావాలంటే సవాలక్ష కండిషన్లు ఉంటాయని, వాటన్నింటినీ కచ్చితంగా నెరవేర్చాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ అన్ని షరతులనూ తు.చ. తప్పకుండా ఫాలో అయినా కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు టైం ఎక్కువ తీసుకుంటుందని అంటున్నారు.
తక్కువ షరతుల కారణంగానే ఇంట్రా లింకింగ్
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ స్టేట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో గోదావరి – కావేరి అనుసంధానాన్ని చేపట్టింది. అందులో భాగంగా సమ్మక్కసాగర్ బ్యారేజీ నుంచి నీటిని తీసుకుని సగం వాటా ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. అయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రా లింకింగ్ కింద గోదావరి – మూసీ అనుసంధానాలపైనా కేంద్ర ప్రభుత్వం ద్వారానే చేయించుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
పీఎంకేఎస్‌వై కింద అనమతులు రాకుంటే ఇంట్రా లింకింగ్ కిందనైనా అనుమతులు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. పీఎంకేఎస్‌వైతో పోలిస్తే ఇంట్రా లింకింగ్ ప్రాజెక్టుల్లో షరతులు తక్కువగా ఉండడం.. పెద్దగా రూల్స్ ఏమీ ఉండకపోవడం వంటి కారణాలతో ఇంట్రా లింకింగ్పైనా సమాలోచనలను జరుపుతున్నట్టుతెలిసింది.ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర (వైన్‌గంగ–నలగంగ), బీహార్ (కోసి–మేచి) వంటి 8 ఇంట్రా రివర్ లింకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఓకే చెప్పింది.
మొత్తంగా 14 ప్రతిపాదనలు రాగా.. 8 ప్రాజెక్టులను పరిశీలించి వాటి అవసరాలకు అనుగుణంగా ఇంట్రా లింకింగ్‌కు అనుమతులిచ్చింది. ఇప్పుడు వాటిని చూపించైనా గోదావరి–మూసీ ఇంట్రా లింకింగ్‌కు కేంద్రం నుంచి ఓకే చెప్పించుకోవాలన్న యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలిసింది. అంతేకాదు.. ఇటీవల కొద్ది రోజుల క్రితం గోదావరి కావేరి ఇంటర్ లింకింగ్‌పై జరిగిన ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగ్‌లోనూ అధికారులు కేంద్ర జలశక్తి శాఖ అధికారులకు దీనిపై ప్రతిపాదనను పెట్టినట్టు తెలిసింది.
అందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. ముందుగా గోదావరి కావేరి లింకింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలను క్లియర్ చేసుకుందామని వారు చెప్పినట్టు తెలిసింది.
10 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని రాబట్టే యోచనలో రాష్ట్ర సర్కారు
మూసీ శుద్ధి, సుందరీకరణలో భాగంగా గోదావరి నీటితో మూసీని నింపాలన్న ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని రాబట్టాలని రాష్ట్ర సర్కారు కృత నిశ్చయంతో ఉంది. గోదావరి నీటిని మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ద్వారా హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్లకు తరలించి మూసీలోకి వదిలేలా సర్కారు ఈ రెండు నదుల లింకింగ్‌పై ఆలోచనలు చేస్తున్నది.
అంతేకాకుండా మధ్యలో రెండు రిజర్వాయర్లనూ స్టోరేజీ పర్పస్‌కు నిర్మించాలని యోచిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ మొత్తంలో రూ.6 వేల కోట్లను మూసీ నది నీళ్లను శుద్ధి చేసేందుకు పలు చోట్ల నది పొడవునా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. మిగతా రూ.4 వేల కోట్లను మల్లన్నసాగర్ నుంచి నీటి తరలింపు, రిజర్వాయర్ల నిర్మాణానికి వాడుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.