హైదరాబాద్, వెలుగు: సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై సర్కారు బదిలీ వేటు వేసింది. ఈయన స్థానంలో డైరెక్టర్ (టెక్నికల్) రవి కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 2న సుంకిశాల సర్జ్‌పూల్ టన్నెల్ గేట్ కొట్టు కుపోయి, రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై మెట్రో వాటర్ బోర్డు ఇప్పటికే ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. ఈ కమిటీ సర్జ్‌పూల్‌ను పలుమార్లు సందర్శించి, రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై విచారణ చేసింది. ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, సైట్ ఇంజినీర్లతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
బుధవారం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే ఆఫీసర్లపై చర్యలు తీసుకున్నది. కాగా, విచారణ కమిటీ నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు వాటర్ బోర్డు అధికారులు రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం మొదట టాటా కన్సల్టెన్సీ ఇచ్చిన డిజైన్ మార్చడం, డీపీఆర్‌లో పేర్కొన్న స్థలంలో కాకుండా వేరే చోట నిర్మాణం చేపట్టడం, అంచనాలు పెంచడం వంటి అంశాలకు పూర్తి బాధ్యులు ఎవరో తేల్చేందుకు మరో ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.