మునుగోడులో ముందట పడని గొర్రెల స్కీం..రాష్ట్రమంతా ఎప్పుడో..

నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గొర్రెల పంపిణీ స్కీంకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది చేయడం లేదు. బైపోల్​లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆగమేఘాల మీద 7,600 యూనిట్లు శాంక్షన్​ చేసింది. దీనికోసం రూ.93కోట్లు డీబీటీ (డైరెక్ట్​ బెనిఫిట్ ట్రాన్స్​ఫర్​) విధానంలో లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసిన సర్కారు కేవలం 224 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్​ చేసింది. ఇంకా, 7,376 యూనిట్లు పెండింగ్​లో పెట్టింది.  ఎన్నికల ఫలితాలు వెలువడి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గొర్రెలు కొనడం లేదు. అదేమంటే కొత్త గైడ్​లైన్స్​ వస్తాయని, ప్రభుత్వం కొనొద్దని చెప్పిందని అధికారులు సమాధానం చెబుతున్నారు. కానీ, కొత్త గైడ్​లైన్స్​కు, మునుగోడులో గొర్రెలు కొనడానికి సంబంధం ఏమిటో చెప్పడం లేదు. మునుగోడు గొర్రెల స్కీం పరిస్థితి ఇట్లా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కింద ఇవ్వాల్సిన 3.58 లక్షల యూనిట్ల పంపిణీ ఏమవుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.  

లబ్ధిదారులను మభ్యపెట్టేందుకే..

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కింద 3.58 లక్షల యూనిట్లు శాంక్షన్​ చేయాల్సి ఉంది. దీనికి రూ.6,125 కోట్లు బడ్జెట్​ కావాలని తెలంగాణ షీప్స్​ అండ్​ గోట్స్​ డెవలప్​మెంట్ ​కార్పొరేషన్ ​ప్రభుత్వానికి ప్రపోజల్ ​పెట్టింది. దీంట్లో లబ్ధిదారుల కంట్రిబ్యూషన్​ కింద రూ.1520 కోట్లు కట్టాల్సి ఉంది. మిగిలిన రూ.4,605 కోట్లు నేషనల్​ కో ఆపరేటివ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ​నుంచి అప్పు తీసుకోవాల్సి ఉంది. కానీ, మొదటి విడత గొర్రెలు కొనేందుకు తీసుకున్న అప్పు రూ.900 కోట్లు ఎన్సీడీసీకి చెల్లించాల్సి ఉంది. సర్కార్​ వద్ద డబ్బులు లేకపోవడంతో నాలుగు దఫాలుగా కట్టాల్సిన కిస్తీలు చెల్లించలేదు. పాత అప్పు క్లియర్​ చేస్తే తప్పా కొత్త లోన్​ రూ.4,605 కోట్లు విడుదలయ్యే పరిస్థితి లేదని అధికారులంటున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం లబ్ధిదారులను మభ్యపెట్టేందుకు కొత్త గైడ్​లైన్స్​పేరుతో కాలయాపన చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

కంట్రిబ్యూషన్ వచ్చాకే..

సెకండ్​ ఫేజ్​ గ్రౌండింగ్​లో భాగంగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో లబ్ధిదారుల కంట్రిబ్యూషన్​ రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎండకాలంలో గొర్రెలు కొనడం సాధ్యం కానందున..కంట్రిబ్యూషన్​ వసూళ్ల పేరుతో రెండు, మూడు నెలలు గడిపే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల నుంచి వచ్చే కంట్రిబ్యూషన్​ బట్టి గ్రౌండింగ్​ ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులకు ఓరల్​ ఆర్డర్స్​ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యా ప్తంగా సదస్సుల హడావిడి కనిపిస్తోంది.  

టార్గెట్​ రూ.1520 కోట్లు...

రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్​ ఫేజ్​లో 3.58 లక్షల యూనిట్లకు లబ్ధిదారుల నుంచి కంట్రిబ్యూషన్ కింద రూ.1520 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి. వీటి కోసం వెటర్నరీ డాక్టర్లు, గ్రామ కార్యదర్వులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కూడిన టీమ్స్​ఇప్పటికే రంగంలోకి దిగాయి. వీరు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కంట్రిబ్యూషన్​ కట్టమని అడుగుతున్నారు. దీంతోపాటు అసలు లబ్ధిదారుల్లో ఎంత మంది బతికున్నారు? వాళ్ల నామినీలు ఎవరు ? అనే వివరాలతోపాటు, ఆధార్,  కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకున్నాక కంట్రిబ్యూషన్​అమౌంట్​కలెక్టర్​అకౌంట్​లో జమ చేస్తారు. అప్పటి వరకు జిల్లా స్థాయిలో గొర్రెల రవాణాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. కంట్రిబ్యూషన్​ అమౌంట్ వచ్చాకే గొర్రెలు కొనే కార్యక్రమం మొదలు పెట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  

మునుగోడులో ఎందుకు ఆగింది? 

మునుగోడులో డీబీటీ విధానంలో రూ.93 కోట్లను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశాక గొర్రెలు కొనడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. 224 మందికి గొర్రెలు కొనిచ్చాక మిగిలిన వారి విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అధికారుల వద్ద సమాధానం లేదు. మొదటి విడత పాత బకాయి రూ.900 కోట్లు ఎన్సీడీసీకి కడితే తప్పా కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేకపోవడంతో లబ్ధిదారుల నుంచి వచ్చే కంట్రిబ్యూషన్​ సొమ్ముతో ఎన్సీడీసీ బకాయిలు చెల్లించొచ్చని భావిస్తోంది. పాత బాకీ క్లియర్​ చేశాకే కొత్తగా వచ్చే అప్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గొర్రెల కొనుగోళ్లు మొదలు పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మునుగోడులో ప్రయోగాత్మకంగా అమలు చేసిన డీబీటీ విధానం ఫెయిల్​ కావడంతో ఇప్పుడు పాత పద్ధతిలోనే కలెక్టర్ ​ఆధ్వర్యంలో గొర్రెలు కొనాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంట్లో భాగంగానే మునుగోడులో గొర్రెల స్కీం మధ్యలో ఆపేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే మళ్లీ ఎన్నికల షెడ్యూల్​వచ్చే వరకు సెకండ్​ ఫేజ్ ​గొర్రెల స్కీం హైడ్రామా కొనసాగుతూనే ఉంటుందని సమాచారం.