
రాజన్నసిరిసిల్ల, వెలుగు: కలెక్టర్, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకోమని, సోషల్ మీడియాలో ప్రభుత్వ అధికారుల పట్ల ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల కింద రాజన్నసిరిసిల్ల కలెక్టర్ జిల్లాకేంద్రంలోని బతుకమ్మ ఘాటు వద్ద పర్యటించారని, ఎలక్షన్ కోడ్ ఉండడంతో సమీపంలోని ఓ టీ దుకాణానికి ఉన్న కేటీఆర్ ఫ్లెక్సీని తొలగించాలని అధికారులను ఆదేశించారన్నారు.
దీనికి స్పందనగా ‘ప్రతీదీ గుర్తుపెట్టుకుంటాను’ అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ప్రతిదీ గుర్తుపెట్టుకొని ఏంచేస్తావని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని ఓడించినా అహంకారం తగ్గడం లేదని ఫైర్ అయ్యారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, లీడర్లు సంగీతం శ్రీనివాస్, స్వరూప, కాముని వనిత ఉన్నారు.
పెద్దమ్మ,పెద్దిరాజుల కల్యాణంలో పూజలు
కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలం కొలనూరులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. మహిళలు డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు వేర్వేరుగా కల్యాణంలో పాల్గొని పూజలు చేశారు. లీడర్లు ఫిరోజ్ పాషా, జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు.