హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ప్రొటోకాల్ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కను సెక్రటేరియెట్ లోకి రానివ్వలేదని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్షాల విషయంలో గత పదేండ్లు వారు ఎలాంటి ప్రొటోకాల్ పాటించారో ముందు జవాబు చెప్పాలని కేటీఆర్ ను ఆయన డిమాండ్ చేశారు.
బీఏసీ సమావేశానికి ప్రతిపక్షాన్ని పిలవనప్పుడు కేటీఆర్ కు ప్రొటోకాల్ గుర్తుకు రాలేదేమోనన్నారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అప్పటి గవర్నర్ తమిళిసై విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటున్న కేటీఆర్.. గతంలో 60 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకున్నప్పుడు ఎంతకు కొనుగోలు చేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు.
కుర్చీపోతే గాని కేటీఆర్ కు రాజ్యాంగ హక్కులు గుర్తుకు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల వివరాల కోసమే తెల్ల రేషన్ కార్డు అని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తామని, ఈ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. పదేండ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వకుండా చేసిన పాపం బీఆర్ఎస్ దేనని ఆది శ్రీనివాస్ఫైర్అయ్యారు.