
రాజన్నసిరిసిల్ల/బోయినిపల్లి/వేములవాడ, వెలుగు: బీజేపీ కూటమికి గత ఎన్నికల్లో ప్రజలు 400కు పైగా ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చడమే ఎజెండాగా పెట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అమలుపై జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టి దేశంలోని వివక్షను రూపుమాపడం కోసం కృషి చేస్తున్నారన్నారు.
అంతకుముందు జిల్లాకేంద్రంలో కురుమ సంఘ భవనానికి 5ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ జిల్లా కురుమ సంఘం నాయకులు ఆది శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వేములవాడ అర్బన్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రూ.2.25 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్, లైబ్రరీ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ రుద్రా సంతోష్, సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆవేశ్ ఖాన్, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, తదితరులు పాల్గొన్నారు.
అధైర్య పడకండి.. అండగా ఉంటాం
చందుర్తి/కోరుట్ల, వెలుగు: వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, పరిహారం చెల్లించి ప్రభుత్వం అండగా ఉంటుందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆదివారం చందుర్తి మండలం దేవునితండాలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రెండు రోజుల్లో నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదిక అందించాలని అధికారులకు ఆయన సూచించారు.
ఆయనతోపాటు ఇన్‌చార్జి డీఏవో రామారావు, చందుర్తి ఏవో అనూష, ఏఈఓ రమ్య, లీడర్లు ఉన్నారు. అంతకుముందు కథలాపూర్ మండలం ఊటపల్లి గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి జాతరను ఘనంగా నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.