- దావోస్‌కు వెళ్లి తెచ్చిన కంపెనీలెన్ని? ఇచ్చిన ఉద్యోగాలెన్ని?: ఆది శ్రీనివాస్
- సీఎం అమెరికా టూర్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారంటూ ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడా రు. రేవంత్ అమెరికా టూర్‌లో సరికొత్త తెలంగాణను అక్కడి ప్రజలకు పరిచయం చేశారని చెప్పారు. కేటీఆర్ పదేండ్లు సూటు బూటు హడావుడికి రేవంత్ కేవలం 8 నెలల్లోనే తగిన సమాధానం చెప్పారన్నారు. మూడుసార్లు దావోస్‌కు వెళ్లి కంపెనీలు తెచ్చానని చెప్పిన కేటీఆర్..
వాటి ద్వారా ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనల పేరుతో దుబాయ్ వెళ్లి సొంత బిల్డింగ్‌లు కొనుక్కున్న మీతో రేవంత్ రెడ్డికి పోలికా? అని ఫైర్ అయ్యారు. కేటీఆర్‌తో ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, ఎవరికీ అంగుళం భూమి కేటాయించక ముందే మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తప్పులు చేసి తిహార్ జైల్లో ఎవరున్నారో ప్రజలకు తెలుసన్నారు. ఈ ప్రభుత్వ పాలన ఇలాగే ఉంటే తమ పని ఖతం అని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు.