- 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా?
- బీఆర్ఎస్లో మిగిలేది నలుగురే
- త్వరలో కాంగ్రెస్లోకి మరికొన్ని చేరికలుంటాయని కామెంట్
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ ను మంత్రిగా చేసినప్పుడు ఫిరాయింపుల విషయం కేటీఆర్ కు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 2019లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎటు పోయిందో కేటీఆర్ చెప్పాలన్నారు.
ఫిరాయింపులపై ఇప్పుడు గగ్గోలు పెడుతున్న కేటీఆర్.. అప్పుడు కేసీఆర్ ను ఎందుకు నిలదీయలేదన్నారు. ట్విట్టర్లో తప్ప కేటీఆర్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో లేడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను హీనంగా చూసిన కేసీఆర్.. ఇప్పుడు ఇంటికి పిలిచి బంతి భోజనాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో వీడ్కోలు పార్టీలు ఇస్తున్నట్టుగా ఉందన్నారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ అని, ఇక ఆ నావలో ఎవరూ ఉండరన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురు మాత్రమేనని, త్వరలో కాంగ్రెస్ లోకి మరికొన్ని చేరికలుంటాయన్నారు.
ప్రగతి భవన్ కంచెలు కూడా తాకనివ్వలే..
ఫామ్ హౌస్ లో విందు పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఇంత కాలం ఎమ్మెల్యేలకు కేసీఆర్ కనీస గౌరవం ఇవ్వలేదని, విందు భోజనాల పేరిట ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నట్టుందన్నారు. ఇప్పుడు రాజ్యాంగం, అన్యాయం, అక్రమం అంటున్న కేటీఆర్ కు.. పదేళ్లలో ఇవి ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు.
ప్రగతి భవన్ కంచెలు కూడా తాకనీయకుండా కేసీఆర్ దుర్మార్గమైన పాలన చేశారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి కేసీఆర్ అనేక కుట్రలు చేశారని, అందుకే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదం పార్టీ అంతర్గత వ్యవహారమని, త్వరలోనే సమసిపోతుందన్నారు.