తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా ఎంపీ ఈటల రాజేందర్ చర్యలు ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. మొన్నటిదాకా సెక్యులర్ అని చెప్పుకున్న ఈటల.. ఇప్పుడు పూర్తిగా మతతత్వవాదిగా మారాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఈటెల రాజేందర్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈర్ష, ద్వేషంతోఈటల రాజేందర్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నేతలు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుళ్లో జరిగిన సంఘటన దురదృష్టకరమని.. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేశారు. ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం కేసుపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని.. రాష్ట్రంలో సామరస్య వాతావరణాన్ని కొనసాగించడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు. ముత్యాలమ్మ ఆలయ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాజకీయ ప్రయోజనం కోసం ఈటల రాజేందర్, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ALSO READ | ఎన్ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు
‘‘కాంగ్రెస్ పార్టీది నీచ చరిత్రని ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నాడు.. దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీ కాంగ్రెస్.. దేశంలో దశాబ్దాలుగా శాంతి సామరస్యాన్నికాపాడుతున్న పార్టీ.. దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ఇందిరా గాంధీ ప్రాణత్యాగం చేశారు..దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లింది కాంగ్రెస్ ప్రధానులు అన్న విషయాన్ని మరిచిపోవద్దు’’ అని ఈటలకు కౌంటర్ ఇచ్చారు.
బీజేపీలా మత విద్వేషాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ ఏనాడు రాజకీయాలు చేయలేదని.. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుజరాత్లో గోద్రా ఘటన జరిగిందన్న విషయాన్ని ఈటల రాజేందర్ మరిచిపోవద్దని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని.. అయినా పట్టించుకోవడం లేదు.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మాత్రం చిచ్చుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు రాష్ట్రంలో అలజడులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.