బీజేపీలో చిలుక జ్యోతిష్యులు ఎక్కువైన్రు : ఆది శ్రీనివాస్

బీజేపీలో చిలుక జ్యోతిష్యులు ఎక్కువైన్రు : ఆది శ్రీనివాస్
  • సీఎంను మారుస్తున్నరని నోటికొచ్చినట్టు వాగుతున్నరు: ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో చిలుక జ్యోతిష్యులు ఎక్కువయ్యారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎంను మారుస్తున్నారని నోటికొచ్చినట్టు వాగుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఏఐసీసీ ఆఫీసు గోడకు చెవులు పెట్టి వింటున్నారా.. అంటూ శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి చేతకాని మీరు ముఖ్యమంత్రి మార్పు గురించి మాట్లాడుతారా? పార్టీ అధ్యక్ష పదవి కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతారా? తెలంగాణ బీజేపీలో లుకలుకలు ఉన్నాయని మీ ఎమ్మెల్యే రాజా సింగ్ రోజూ బయటపెడుతూనే ఉన్నారు.

ముందు వాటి గురించి ఆలోచించుకోండి. సంచలనం కోసమే ధర్మపురి అర్వింద్ చిలుక జ్యోతిష్యం చెబుతున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. వసూళ్లు చేయాల్సిన కర్మ తమకు లేదని, ఈ దేశంలో వసూళ్ల పార్టీ ఏదో ఎన్నికల సంఘం లెక్కలు చెప్తూనే ఉన్నాయన్నారు. 8వేల మంది కార్పొరేట్ వ్యక్తుల నుంచి ఏకంగా రూ.2,243 కోట్ల విరాళాలు బీజేపీకి వచ్చాయని, మీరు వసూళ్లు చేయకపోతే ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయో ధర్మపురి అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు.

‘రేవంత్ రెడ్డి పేపర్ పులి అని అర్వింద్ అంటున్నడు.. రేవంత్ రెడ్డి ఏ పులో నీకు బాగా తెలుసు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తు గా ఓడిపోయిన కేసీఆర్, కిషన్ రెడ్డిని అడిగితే తెలుస్తుది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన 11 ఏండ్లలో  కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మరి ఆయన పులినా, లేక పిల్లినా?’ అని ఆది శ్రీనివాస్​ ప్రశ్నించారు.