వేములవాడ/వేములవాడరూరల్, వెలుగు: గత ప్రభుత్వాల ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉందని, అయినప్పటికీ ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ ఎంపీడీవో ప్రాంగణంలో గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ కిట్లను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గౌడ సోదరులకు రక్షణ కోసం కాటమయ్య కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రం అప్పుల్లో ఉందని, ప్రతినెలా వచ్చే రూ.18 వేల కోట్ల ఆదాయంలో రూ.6 వేల కోట్లు వడ్డీలకే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. గీత కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సామూహిక ఈత, తాటి వనాలను పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అంతకుముందు వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్, అబ్కారీ శాఖ అధికారి పంచాక్షరీ, ఇతర అధికారులు రవీందర్‌రెడ్డి, డాక్టర్ అభిలాష్, డా.అంజిరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రొండి రాజు, లీడర్లు సామ కవిత, అంజగౌడ్, శ్రీనివాస్, ఎల్లారెడ్డి, మల్లయ్య, చెరుకు శంకర్, తదితరులు
పాల్గొన్నారు.