ఫోన్ ట్యాపింగ్ కేసుతో..కల్వకుంట్ల ఫ్యామిలీ పీకల్లోతు మునిగింది : ఆది శ్రీనివాస్  

  •   రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకున్నది  వాళ్లే.. 
  •   కేటీఆర్​, హరీశ్​ రావు మతిపోయి మాట్లాడుతున్నారు
  •  ‌ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  

వేములవాడ, వెలుగు : ఫోన్​ ట్యాపింగ్​ కేసుతో కల్వకుంట్ల  ఫ్యామిలీ పీకల్లోతు మునిగిపోయిందని, కేటీఆర్​, హరీశ్​ రావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ అన్నారు. గురువారం వేములవాడలో మీడియాతో మాట్లాడారు. ఫోన్​ ట్యాపింగ్​పై కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయనకు మతి భ్రమించినట్టు అనిపిస్తుందని  ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందని కేసీఆర్​ అనడం సిగ్గుచేటని అన్నారు. కేటీఆర్​, హరీశ్​ రావు మాటలు చూస్తే..  బావా బామ్మర్దులు కలిసి రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని కంకణం కట్టుకున్నట్టుందని విమర్శించారు.  

రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష నాయకుని హోదాలో కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.   ప్రజలు బీఆర్ఎస్  ను నమ్మే పరిస్థితి లేదన్నారు.  రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ పట్టణ  అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్​, నాయకులు సంగ స్వామియాదవ్​, కూరగాయలు కొమురయ్య, పుల్కం రాజు, సాగారం వెంకటస్వామి  పాల్గొన్నారు. 

కాంగ్రెస్ లో చేరికలు

కోనరావుపేట,వెలుగు : కోనరావుపేట  కొలనూరు సింగిల్ విండో డైరెక్టర్ గరుగుల నాగిరెడ్డి, రామన్నపేట మాజీ సర్పంచ్ దేవరాజ్ తో పాటు మరి కొంతమంది నాయకులు గురువారం కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, లచ్చిరెడ్డీ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.