దళారులను నమ్మి మోసపోవద్దు : ఆది శ్రీనివాస్‌‌

దళారులను నమ్మి మోసపోవద్దు : ఆది శ్రీనివాస్‌‌

వేములవాడ/కోనరావుపేట, వెలుగు: పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సీసీఐ కొనుగోలు సెంటర్లలోనే అమ్మాలని ప్రభుత్వ విప్​ అది శ్రీనివాస్​ సూచించారు.  సోమవారం వేములవాడ పరిధిలోని నాంపల్లి, సంకేపల్లి, కోనరావుపేట మండలం సుద్దాలలో ఏర్పాటుచేసిన సీసీఐ పత్తి కొనుగోలు సెంటర్లను కలెక్టర్​ సందీప్​కుమార్ ఝా, అడిషనల్‌‌ కలెక్టర్​ ఖీమ్యానాయక్‌‌తో కలిసి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీఐ సెంటర్లలో అమ్మితేనే మద్దతు ధర దక్కుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 200కి పైగా వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించామన్నారు. ఆర్డీవో రాజేశ్వర్​, తహసీల్దార్​ మహేశ్‌‌​, నీలం శ్రీనివాస్​, అరోగ్య రెడ్డి, ఉమరాజిరెడ్డి, చీకోటి రమేశ్‌‌, రాజు, చంద్రయ్య, అధికారులు పాల్గొన్నారు. 

సర్పంచులకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్​

ఎల్లారెడ్డిపేట, వెలుగు: జీపీల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకుండా గత బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం సర్పంచులకు అన్యాయం చేసిందని విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి నూతన గృహప్రవేశానికి సోమవారం హాజరై మీడియాతో మాట్లాడారు. 

గ్రామాల్లో బిల్లులు శాంక్షన్ చేయకుండానే పల్లెప్రకృతివనాలు, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు పేరిట సర్పంచులతో బలవంతంగా పనులు చేయించిందన్నారు. అధికారం పోయాక సర్పంచులపై ఆ పార్టీ లీడర్లు కపట ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, లీడర్లు లక్ష్మారెడ్డి, గిరిధర్ రెడ్డి, సుధాకర్, రాంరెడ్డి, రాజేశం, బాల్ రెడ్డి ఉన్నారు.