
- స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు సీఐడీ నుంచి పిలుపు
హైదరాబాద్, వెలుగు: చెన్నమనేని రమేశ్ కేసులో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. చెన్నమనేని రమేశ్ కు భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని గత నెల 17న ఆది శ్రీనివాస్ సీఐడీ డీజీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై కోర్టు వెల్లడించిన ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత తన లీగల్ టీంతో చర్చించినట్టు తెలిపారు. న్యాయనిపుణుల సూచనలతో ఫిర్యాదు చేస్తున్నట్టు వెల్లడించారు. చెన్నమనేని రమేశ్‌కు సంబంధించి మొత్తం 44 అంశాలతో కూడిన 11 పేజీల ఫిర్యాదును సీఐడీకి ఆది శ్రీనివాస్ అందించారు.
ఐపీసీతోపాటు ఇండియన్ పాస్‌పోర్ట్ యాక్ట్, ది ఫారినర్స్ యాక్ట్, ఇండియన్ సిటిజన్‌షిప్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు చెన్నమనేని రమేశ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కేసు వివరాలు ఇచ్చేందుకు బుధవారం ఆఫీసుకు రావాలని ఆది శ్రీనివాస్‌కు సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లక్డీకపూల్‌లోని సీఐడీ ఆఫీసుకు హాజరుకానున్నారు.