- పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలో నేత కార్మికుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల పట్టణంలోని గణేశ్నగర్కు చెందిన ఎర్రం కొమురయ్య(55) పవర్‌లూమ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొమురయ్య కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడని స్థానికులు తెలిపారు. ఇంటి నిర్మాణానికి, కూతురు వివాహానికి కొమురయ్య అప్పు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో మనస్తాపానికి గురై బుధవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. కొమురయ్య మంగళవారం వరకు పవర్‌లూమ్ నడిపాడని స్థానికులు చెబుతున్నారు. ఆయనకు భార్య కమల, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కె.కృష్ణ తెలిపారు.
నేతన్నలను ప్రభుత్వ ఆదుకుంటుంది..
నేతన్నలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న ఎర్రం కొమురయ్య కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.2లక్షల చెక్కును ఆయన అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్నల పరిస్థితిని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
నేతన్నల ఆత్మహత్యలు బాధాకరమని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకే ఇటీవల నూలు డిపో తీసుకొచ్చామని, ఆర్టీసీ, పోలీస్ డిపార్ట్మెంట్, గురుకుల విద్యార్థుల యూనిఫాం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.