బీఆర్ఎస్ పాలనలో సహకార సొసైటీలు నిర్వీర్యం : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 బీఆర్ఎస్  పాలనలో సహకార సొసైటీలు  నిర్వీర్యం : అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు:  నియోజకవర్గంలోని ధర్మపురి,పెగడపెల్లి,గొల్లపెల్లి సొసైటీలను బీఆర్ఎస్ పాలకులు  నిర్వీర్యం చేశారని  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం  మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్ లో  మీడియాతో మాట్లాడారు.   ధర్మపురి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు,రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించినట్టు తెలిపారు.  గత 10సంవత్సరాల సొసైటీ లెక్కలపై విచారణ జరపాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి  పత్రం ఇచ్చామని,   దానిపై విచారణ కమిటీ విచారణ జరిపి నివేదిక తయారు చేసినట్టు తెలిపారు.

సొసైటీ లెక్కలు అడిగితే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తమపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మాట్లాడడం   సరికాదన్నారు.  పెగడపల్లి మండలం సొసైటీ  నుంచి ఎలాంటి  అనుమతులు లేకుండా రూ. కోటి 64లక్షలతో  ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని, దీంతో రైతులకు ఏం లాభం  అని  ప్రశ్నించారు. 2016లో  రూ.60కోట్లతో ప్రారంభమైన రోడ్ల వ్యయాన్ని  రూ. 160 కోట్లకు  పెంచి దాని నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదన్నారు. కొప్పుల ఈశ్వర్ ఒక మంత్రి హోదాలో ఉండి కూడా ఈ ప్రాజెక్టుకి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకురాలేకపోయారని విమర్శించారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.