
జగిత్యాల టౌన్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో మహిళా ప్రాధాన్యత పెరిగిందన్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసి సమాజంలో వారికి గౌరవాన్ని పెంపొందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మహిళల కోసం రూ.500కే గ్యాస్ సిలిండర్, 200యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలను వ్యాపారవేత్తలుగా మలిచేందుకు సోలార్ పవర్ ప్లాంట్లను, ఇండస్ట్రియల్ పార్కులో ఐదు శాతం, జిల్లాకు మహిళా పెట్రోల్ పంపును ఇచ్చామన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం చిన్నారుల డ్యాన్సులు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.