- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : రైతులకు మరింత మేలు చేయడం కోసమే 'రైతుభరోసా' పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఆదివారం యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి సాగుచేసే నిజమైన రైతులకే మరింత ఎక్కువ పంటసాయం అందిచడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. ఇందుకోసమే రైతుభరోసా తెచ్చామన్నారు.
భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల సాయం అందించబోతున్నామని చెప్పారు. అలాగే రేషన్ కార్డు లేనివారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నామన్నారు. ఈ నెల 26 నుంచి రైతుభరోసా, వ్యవసాయ కూలీలకు సాయం, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలను ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజా తీర్పును గౌరవించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు గుండు సున్నా తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యా మహేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మదర్ డెయిరీ డైరెక్టర్ శ్రీశైలం, కౌన్సిలర్ మల్లేశ్ యాదవ్, నాయకుడు హేమేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి,
పాల్గొన్నారు.