రుణమాఫీ మాట నిలబెట్టుకున్నాం : బీర్ల ఐలయ్య

రుణమాఫీ మాట నిలబెట్టుకున్నాం :  బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. తుర్కపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.32 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన రైతుసేవా దుకాణ సముదాయ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకే ఏడాదిలో 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల పంట రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర నిర్ణయించి మూడు రోజుల్లోనే డబ్బులు వారి అకౌంట్లలో జమ చేశామని, సన్నాలకు బోనస్ కింద అదనంగా క్వింటాల్​కు రూ.500 చెల్లించామని చెప్పారు.

వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ దుకాణాల్లో ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సన్న బియ్యంతోనే ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లు, అంగన్​వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు భోజనం పెట్టనున్నామన్నారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ఇమ్మడి రాంరెడ్డి, సింగిరెడ్డి నరసింహారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్ నాయక్, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మోహన్ బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.