ఆందోళన చెందొద్దు.. ఆదుకుంటాం : బీర్ల ఐలయ్య

ఆందోళన చెందొద్దు.. ఆదుకుంటాం : బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : తుర్కపల్లి మండలంలో అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆదుకుంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భరోసా ఇచ్చారు. తుర్కపల్లి మండలంలో గురువారం కురిసిన వడగండ్ల వానకు అతలాకుతలమైన వరి పంట, మామిడి, కూరగాయల పంటను శుక్రవారం పరిశీలించారు. పంటనష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 

స్పాట్ నుండే అధికారులకు ఫోన్ చేసి నష్టపోయిన పంటను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నీటి పాలు కావడం బాధాకరమన్నారు. అకాల వర్షానికి చేతుకొచ్చిన పంట నేలపాలైతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. బాధిత రైతులను తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు నివేదికలు సమర్పించగానే.. ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం అందేలా చూస్తామని పేర్కొన్నారు.

నష్టపోయిన పంటను పరిశీలించిన కలెక్టర్.. 

తుర్కపల్లి మండలంలో అకాల వర్షానికి అతలాకుతలం అయిన పంట పొలాలను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. తుర్కపల్లి మండలం దయ్యంబండ తండాలో ఈదురుగాలులు, వడగండ్ల వానకు పూర్తిగా నష్టపోయిన వరి పంట, నేలరాలిన మామిడితోటను రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి వెంట తహసీల్దార్ దేశ్యానాయక్, హార్టికల్చర్ అధికారి సుభాషిణి, ఎంపీడీవో, అధికారులు ఉన్నారు.