ధర్మపురి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో చాలా వరకు అమలుచేసినట్లు చెప్పారు. ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని విమర్శించారు.
పత్తిపాక రిజర్వాయర్నిర్మాణంతోపాటు, రోళ్లవాగు ప్రాజెక్ట్ పనులపై ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు బీఆర్ఎస్ లీడర్లు.. బీజేపీకి ఓటేయాలని ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.