భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రుణాల మంజూరు చేసినట్లుగానే రికవరీ చేయాల్సిన బాధ్యత ఏపీఎం, సీసీలపై ఉందని కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్డీవో ఆఫీస్‌లో శుక్రవారం బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీ, వ్యవసాయ పరికరాల వినియోగంపై బ్యాంకర్లు, ఐకేపీ సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 14,819 స్వయం సహాయక సంఘాలకు రూ. 510 కోట్ల రుణాలు మంజూరు కాగా, 5,305 సంఘాలకు రూ. 293 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రూ. 128 కోట్ల స్త్రీనిధి రుణాల లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ. 55 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆశించిన మేర రికవరీలు జరగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అన్నిరంగాల్లో ముందున్నా రుణాల రికవరీలో వెనుకబడిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదంతా మీతోనే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేకపోతే మానేయాలని, మీ వల్ల నేను సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. జూలూరుపాడు, చుంచుపల్లి, ముల్కలపల్లి, చర్ల, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల ఏపీఎంలు, సీసీలకు వేతనాలు నిలిపివేయాలని డీఆర్డీవోను ఆదేశించారు. రికవరీలు పూర్తయ్యేంత వరకు హెడ్ క్వార్టర్లలో ఉండాలన్నారు. డీఆర్డీవో మధుసూదనరాజు, ఎల్డీఎం రామిరెడ్డి, అడిషనల్ డీఆర్డీవో నీలేష్, స్త్రీనిధి ఆర్ఎం సంపత్ పాల్గొన్నారు.
అడవులు నరికితే క్రిమినల్ కేసులు
అడవులను నరికే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. చెట్లను నరికితే నష్టాన్ని రికవరీ చేస్తామని తెలిపారు. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు సర్వే కొనసాగుతుందని చెప్పారు. సర్వే జరుగుతున్న క్రమంలోనే కొందరు చెట్లను నరికివేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొత్తగా అడవులను నరికితే గతంలో వారికి జారీ చేసిన పోడు పట్టాలను రద్దు చేస్తామన్నారు. అటవీ భూములను ఆక్రమించినా, ప్లాంటేషన్లను ధ్వంసం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
బంగారు కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం,వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం భక్తులకు బంగారు కవచాలతో దర్శనమిచ్చారు. గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసిన అనంతరం స్వర్ణకవచాలను అలకరించారు. బాలబోగం నివేదించారు. బంగారు సీతారామయ్యను తిలకించి భక్తులు పులకించిపోయారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చనలు జరిగాయి. ప్రాకార మండపంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు కంకణాలు ధరించి స్వామివారి కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత స్వామికి రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవను అద్దాల మండపంలో నిర్వహించారు. దర్బారు సేవలో కాగడ హారతితో పాటు శ్రీసీతారామచంద్రుడికి సంధ్యాహారతిని భక్తుల జయజయధ్వానాల నడుమ ఇచ్చారు.
ఆదివాసీలకు అండగా ఉంటా
మణుగూరు, వెలుగు: జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హామీ ఇచ్చారు. మండలంలోని కూనవరం గ్రామపంచాయతీలోని అటవీ ప్రాంతంలో ఉన్న రేగులగండి గ్రామంలో శుక్రవారం పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, కరెంట్, మంచినీటి సౌకర్యం కల్పించేందుకు వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సరైన మౌలిక వసతులు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రేగులగండి గ్రామం నుంచి మణుగూరు పట్టణానికి అత్యవసర పరిస్థితుల్లో వచ్చేందుకు తన సొంత ఖర్చులతో ఆటో కొనిస్తానని హామీ ఇచ్చారు. జడ్పీటీసీ పోశం నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరావు, సీఐ ముత్యం రమేశ్, ఎస్సైలు రాజ్ కుమార్, పురుషోత్తం, ఎంపీవో వెంకటేశ్వరరావు, ఆర్ఐ శ్రీనివాస్, ముత్యం బాబు,అడప అప్పారావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన గజ ఈతగాళ్లు
భద్రాచలం, వెలుగు: ఇటీవల గోదావరి వరదల సమయంలో సేవలు అందించిన గజ ఈతగాళ్లు శుక్రవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ప్రాణాలకు తెగించి సేవలందించిన తమకు వేతనాలు ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారని వాపోయారు. సబ్‌కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా సగం కంటే తక్కువ డబ్బులు ఇచ్చి సరిపెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సర్కారువి అన్నీ బూటకపు హామీలేనని, రూ.1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి వెళ్లిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు పైసా విడుదల చేయలేదని ఆరోపించారు. వరదల సమయంలో బాధితులకు అన్నం పెట్టిన హోటళ్ల ఓనర్లకు, గజ ఈతగాళ్లకు పైసలు ఇవ్వలేని దుస్థితిలో సర్కారు ఉందని విమర్శించారు.
రూ.5 లక్షల చీప్ లిక్కర్ చోరీ
దమ్మపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలకేంద్రంలోని వెంకటేశ్వర వైన్స్ లో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. రూ.5 లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం షాప్ నిర్వాహకులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు సీసీ కెమెరాలను
ధ్వంసం చేసి, 64 కేసుల చీప్ లిక్కర్ ఎత్తుకెళ్లారు. అయితే.. దొంగలు విలువైన మద్యాన్ని అక్కడే పెట్టి చీప్ లిక్కర్ ను ఎత్తుకెళ్లడం గమనార్హం. అశ్వారావుపేట సీఐ బాలకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.
డ్వాక్రా గ్రూపులకు గ్రామదీపిక టోకరా
భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలో ఓ గ్రామదీపిక డ్వాక్రా గ్రూపులకు టోకరా ఇచ్చారు. ఏకంగా సభ్యుల పేరుతో రుణాలు తీసుకుని రూ.24 లక్షలు స్వాహా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం పట్టణంలోని మదర్‌థెరిసా సమైఖ్యకు చెందిన డ్వాక్రా గ్రూపు గ్రామదీపిక ఎడారి సంధ్యారాణి గ్రూపు సభ్యులకు తెలియకుండా వ్యక్తిగత లోన్లు, స్త్రీ నిధి రుణాల పేరుతో రూ.24 లక్షలు తీసుకున్నారు. గ్రూపులకు మంజూరైన గేదెలను కూడా ఆమె తీసుకున్నారు. వీటి లెక్కలు కూడా లేవు. అవి తిరిగి చెల్లించక పోవడంతో బ్యాంకు ఆఫీసర్లు మదర్ థెరిసా గ్రూపు సభ్యులను నిలదీయడంతో సభ్యులంతా ఐకేపీ కార్యాలయానికి వెళ్లి సీసీ, ఏపీఎంలను ఈ విషయమై ప్రశ్నించారు. వారు కూడా గ్రామదీపికతోనే తేల్చుకోవాలనడంతో శుక్రవారం వారంతా ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఆమె స్పందించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె నుంచి రికవరీ చేసి గ్రామదీపికను తొలగించాలని కోరారు. ఈ ఘటన టౌన్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాముడి భూములు కబ్జా చేస్తున్న వారిని నిలదీయాలి
భద్రాచలం, వెలుగు: ఏపీలో విలీనమైన ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భూములను కబ్జా చేస్తున్న వారిని నిలదీయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర కార్యదర్శి శాలివాహన పండరీనాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలం రామాలయం ఈవో శివాజీని కలిసి రాముడి భూముల కబ్జాపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేవస్థానం భూములపై మాఫియా కన్నేసిందని, వారికి ఏపీ ఆఫీసర్లు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధులు బాహాటంగా రాముడి భూములను కబ్జా చేయడంతో పాటు ప్రోత్సహిస్తుంటే అక్కడి ఆఫీసర్లు మాత్రం సివిల్ మ్యాటర్ అంటూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. రాముడి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. రామయ్య ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడతామని చెప్పారు. వీహెచ్‌పీ రాష్ట్ర సహ కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, అర్చక, పురోహిత ప్రముఖ్ ఓరుగంటి సురేశ్‌కుమార్
ఉన్నారు.
రూ.16.58 లక్షల రికవరీకి ఆదేశం
ములకలపల్లి, వెలుగు: మండలంలో రెండున్నరేండ్లుగా జరిగిన ఉపాధి పనులపై గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఓపెన్ ఫోరం నిర్వహించారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో రూ.16.58 లక్షలు దుర్వినియోగం అయ్యాయని ఆడిట్ టీమ్ లెక్కలు తేల్చారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి రూ.38 వేలు పెనాల్టీ విధించారు. జగన్నాథపురం గ్రామపంచాయతీలో రూ.2.57 కోట్ల పనులు జరగగా, రూ.10.21 లక్షలు, పూసుగూడెం జీపీలో రూ.2.18 కోట్ల పనులు జరగగా, రూ.2.25 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో ఆర్వీ సుబ్రహ్మణ్యం, సోషల్ ఆడిటర్ అనూష, ఏవీవో రమణ, అంబుడ్స్‌మన్ నాగప్రకాష్, ఎంపీడీవో ఆర్సీహెచ్ నాగేశ్వరరావు, ఏపీవో విజయలక్ష్మి, ఎస్ఆర్పీ రమేశ్, డీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.