
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట పట్టణాన్ని ప్రత్యేక నిధులతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్టలో యాదగిరిపల్లి నుంచి గాంధీబొమ్మ సర్కిల్ వరకు ఏర్పాటు చేసే బీటీ రోడ్డు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ నారసింహుడి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయం కల్పించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు.
భక్తులతోపాటు స్థానికులకు వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా రూ.300 కోట్లతో నిర్మిస్తున్న మూడు ఓవర్ హెడ్ ట్యాంకుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజ్, వేద పాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు సైతం మంజూరు చేసిందన్నారు. అండర్ డ్రైనేజీ, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సకల సదుపాయాలతో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు భిక్షపతి, ఉపాధ్యక్షుడు భాస్కర్, నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం..
రాజాపేట: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. సీపీ రోడ్లు, నూతన గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవాలు వంటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.