కొత్త ఏడాదిలో కేటీఆర్, హరీశ్​కు సినిమా చూపిస్తం: విప్ బీర్ల అయిలయ్య

  • బీఆర్ఎస్ కథ క్లైమాక్స్​కు చేరింది:విప్ బీర్ల అయిలయ్య

హైదరాబాద్, వెలుగు: కొత్త ఏడాదిలో కేటీఆర్, హరీశ్​కు సినిమా చూపిస్తామని, బీఆర్ఎస్ కథ ఇక క్లైమాక్స్ కు చేరిందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ఏడాదిలో  కేటీఆర్ అరెస్టు ఖాయమని తెలిపారు. హరీశ్ కూడా కొత్తదారి చూసుకుంటాడని చెప్పారు. బెయిల్ పై ఉన్న ఎమ్మెల్సీ కవితకు బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. " తెలంగాణ సమస్య అయిపోయిందని.. కొత్తగా బీసీ సమస్యను ఎత్తుకున్నారు.

3తమకు అన్యాయం చేశారనే బీఆర్ఎస్ ను బీసీలు  బొందపెట్టారనే విషయాన్ని కవిత గుర్తించాలి. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి.  కేటీఆర్, హరీశ్ లు ప్రతిపక్ష నేత హోదా కోసం పోటీపడుతున్నారు" అని అయిలయ్య ఎద్దేవా చేశారు.  బీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందాలు  చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈడీ, ఏసీబీ కేసు ఉట్టి కేసే అంటున్న కేటీఆర్..మరి ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు పదేండ్లు తెలంగాణను లూటీ చేశారని, రాష్ట్రాన్ని ఏటీఏంలా వాడుకున్నారని అయిలయ్య పేర్కొన్నారు.