సమస్యలు పరిష్కరించకుంటే.. ఉద్యోగాలకు రాజీనామా చేయండి : బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : ధరణి పెండింగ్ సమస్యపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీరియస్​ అయ్యారు. ధరణి సమస్యల పరిష్కారంలో 33 జిల్లాల్లో యాదాద్రి జిల్లా వెనుకబడిందన్నారు. సమస్య పరిష్కరించనప్పుడు ఇక్కడ నుంచి తహసీల్దార్లు ట్రాన్స్​ఫర్ చేయించుకోవాలని లేకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయాలని సూచించారు. జిల్లాలోని ఆలేరు మండల పరిషత్​మీటింగ్​సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆలేరు తహసీల్దార్​ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్న క్రమంలో ధరణి గురించి ఐలయ్య ప్రస్తావించారు.

ధరణిలో పెండింగ్​కారణంగా రాష్ట్రంలో యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు వెనుకబడి పోయిందన్నారు. అన్ని జిల్లాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఆఫీసర్లు ఎందుకు పరిష్కరించడం లేదంటూ ప్రశ్నించారు. జిల్లా వెనుకబడడం షేమ్​గా ఉందని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా వెనుకబాటు విషయం సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి వెళ్లిందని చెప్పారు. కోర్టు కేసులు, వివాదాలు ఉంటే వాటిని పెండింగ్​లో పెట్టాలి..

కానీ మిగిలినవి ఎందుకు పెండింగ్​పెట్టి జిల్లాకు చెడ్డపేరు తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యనే ప్రభుత్వం ప్రధాన సమస్యగా తీసుకుంటుంటే.. మీరు మాత్రం పని చేయడం లేదన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్​మిట్టల్​వారం టైమిచ్చారని, ఈలోపు అన్ని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.