యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీని మోడల్‌గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో సీసీ రోడ్డు పనులు, అంగడి బజార్ ఎదురుగా 'యాదాద్రి వాకర్స్ అర్బన్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ' ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు.
స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఇష్టానుసారంగా డెవలప్మంట్ పనులు చేయడంతో యాదగిరిగుట్ట పట్టణం రెండుగా చీలిపోయి స్థానిక చిరువ్యాపారులు, దుకాణదారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో ఆటోలు కొండపైకి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించి బతుకులు బజారున పడేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి కొండపైకి ఆటోలను అనుమతించామని చెప్పారు.
స్థానిక ప్రజలతోపాటు స్వామివారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు వసతితోపాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంతో యాదగిరిగుట్ట పట్టణాన్ని డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, కౌన్సిలర్లు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, టౌన్ ప్రెసిడెంట్ భిక్షపతి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.