ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..మాజీ ఎమ్మెల్యే సునీతకు బీర్ల ఐలయ్య సవాల్

యాదగిరిగుట్ట, వెలుగు : అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నానని తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా.? అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కొలనుపాక ల్యాండ్ ఇష్యూకు సంబంధించి 154  డాక్యుమెంట్లలో తన పేరు, తన అనుచరుల పేరు ఉన్నట్లు నిరూపిస్తే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని స్పష్టం చేశారు. బీసీ ఎమ్మెల్యేను కాబట్టే, నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గొంగిడి సునీతను ఆలేరు ప్రజలు చిత్తుగా ఓడగొట్టడంతో..

పదవి పోయిందనే బాధలో ఆమె పసలేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఏడాది కాలంగా ఆలేరు నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి పనులు చూసి.. స్వయంగా ప్రజలే తనను 'బీర్ల ఐలయ్య' బదులు 'నీళ్ల ఐలయ్య' అనే పేరుతో పిలుస్తున్నారని తెలిపారు.

దీనిని చూసిన గొంగిడి సునీత.. ఓర్వలేక మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం మైలారుగూడెం, చొల్లేరు, చిన్నకందుకూరు, వంగపల్లి, మాసాయిపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు  చేశారు.